టీఆర్ఎస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు జంప్?
posted on Jun 1, 2014 4:29PM

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి జంప్ అవబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సత్తుపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతోనే సండ్ర వీరయ్య తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టబోతున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే స్థానం సండ్ర వీరయ్యదే. ఇప్పుడాయన టీఆర్ఎస్‌లో చేరితే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో తారస్థాయికి చేరిన విభేదాలే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామా నాగేశ్వరరావు పోటీ చేయగా, ఖమ్మం అసెంబ్లీ స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొని వుండేది. ఇలా ఇద్దరు నాగేశ్వరరావులూ ఒకరి మీద మరొకరు విభేదాలు పెంచుకున్నారు. ఫలితంగా ఇద్దరూ గత ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం భంగపడటానికి కారణం మీ నాయకుడంటే మీ నాయకుడంటూ తుమ్మల, నామాలకు చెందిన వర్గీయులు రోడ్డుమీద జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు కూడా! తన ఓటమికి నామా నాగేశ్వరరావు వర్గీయులు తనను వెన్నుపోటు పొడవటమే కారణమని తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచీ తన సన్నిహితుల దగ్గర వాపోతూ వస్తున్నారు. నామా మీద చర్యలు తీసుకోవాలని ఆయన భావించారు. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నామా సన్నిహితుడు కావడం వల్ల తనకంటే నామాకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం తుమ్మలలో వుంది. దీనివల్లే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగినా చురుగ్గా పనిచేసే తుమ్మల తాజాగా జరిగిన మహానాడుకు హాజరు కూడా కాలేదు. టీఆర్ఎస్‌లో బెర్త్ కన్ఫమ్ కావడం వల్లే ఆయన తెలుగుదేశం పార్టీ వేడుకకు దూరంగా వున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.