కిందపడ్డా పైచెయ్యే!

 

 

 

విభజన వాదులు ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోరు. సమైక్య వాదుల విజయాన్ని కూడా తమ అకౌంట్లో వేసుకుని తమదే విజయమని అంటూ వుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే కిందపడ్డా పైచేయి అనే సామెత పుట్టినట్టుంది. తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానం గురువారం నాడు భారీ గందరగోళం మధ్య అసెంబ్లీ ఆమోదం పొందింది. ఇటు శాసన సభలో, అటు శాసనమండలిలో కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించే తీర్మానం ఆమోదం పొందింది.

 

 

గురువారం నాడు సీమాంధ్ర సభ్యుల మీద దౌర్జన్యం చేసి అయినా సీఎం ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కార తీర్మానంపై ఓటింగ్ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు వ్యూహరచన చేశారు. అయితే స్పీకర్ మనోహర్ క్షణాల్లో విభజన బిల్లును తిరస్కరించే తీర్మానానికి ఓటింగ్ నిర్వహించడం, మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందడం జరిగిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో షాకైన విభజనవాదులు కొద్ది నిమిషాలు నోట మాట రాకుండా వుండిపోయినా, ఆ తర్వాత తమదైన శైలిలో గళం విప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ముగిసిందని, ఇక తెలంగాణ రావడం ఖాయమని మీడియా పాయింట్లో స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు.



అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని తిరస్కరించినందువల్ల నష్టమేమీ లేదని, పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభిస్తుందని అతి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అసలు అసెంబ్లీ అభిప్రాయానికి విలువే లేదని తేల్చేసి చెప్పేశారు. మరి అసెంబ్లీ అభిప్రాయానికి విలువ లేకపోతే బిల్లు అసెంబ్లీకి రావాలని పట్టు పట్టడం ఎందుకో, చర్చ జరగాలని గొడవ చేయడమెందుకో, సీమాంధ్రుల వాణి వినపడకుండా గందరగోళం సృష్టించడమెందుకో విభజనవాదులకే తెలియాలి. అసెంబ్లీ బిల్లును తిరస్కరించినా కేంద్రం హాయిగా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించే అవకాశమే వుంటే అసలు బిల్లును రాష్ట్రానికి పంపడం ఎందుకో విభజనవాదులే చెప్పాలి. ఏది ఏమైనా కీలక సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏకతాటి మీద నిలిచి విభజన వ్యతిరేక తీర్మానానికి మద్దతు పలకడం శుభ పరిణామం. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu