వాణిజ్య ఉత్స‌వంతో జ‌గ‌న‌న్న ఆడంబ‌రాలు.. ఉద్యోగాలెక్కడ అంటున్న జనాలు? 

విజ‌య‌వాడ‌లో వాణిజ్య ఉత్స‌వం పేరుతో ఆడంబ‌రం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ సీఎం జ‌గ‌న్ హామీలు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ట‌. 2020-2021లో 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయట‌. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందట‌. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీది నాలుగో స్థానమ‌ట‌. రెండేళ్లలో 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశార‌ట‌. 55వేల మందికి ఉపాధి కల్పించార‌ట‌. అబ్బో.. ఇలా వాణిజ్య ఉత్స‌వం వేదిక‌గా సీఎం జ‌గ‌న్ నోటి నుంచి అంతా అవాక్క‌య్యే ప్ర‌సంగం వినిపించింది. 

టీవీల్లో ఆయ‌న ప్ర‌సంగం విన్న ఆంధ్రులంతా.. అవునా, మ‌న రాష్ట్రం ఇంత‌గా దూసుకుపోతోందా? ఏపీ నుంచి ఇంత భారీ ఎగుమ‌తులు జ‌రిగాయా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక జ‌గ‌న్ చెప్పిన 10 మెగా ప్రాజెక్టులు, 55వేల మందికి ఉపాధి గురించి తెలిసి.. మ‌రింత అవాక్క‌వుతున్నారు. మేమంతా ఉపాధి లేక‌, ఉద్యోగాలు లేక‌, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు లేక నిరుద్యోగులుగా అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. మాకు తెలీకుండా మా రాష్ట్రంలో ఇన్ని ప‌రిశ్ర‌మ‌లు, ఇన్ని వేల ఉద్యోగాలు ఎప్పుడొచ్చాయి? ఎవ‌రికి వ‌చ్చాయి? అంటూ నోరెళ్ల బెడుతున్నారు. 

ఏపీ ప్ర‌భుత్వ బెదిరింపులు తట్టుకోలేక ద‌శాబ్దాలుగా కంపెనీ న‌డుపుతున్న‌ అమ‌ర‌రాజానే త‌ర‌లి వెళ్లిపోయేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. వైసీపీ ఎంపీ బెదిరింపుల‌తో కియా కంపెనీ ఎందుకొచ్చామా అని త‌ల‌ప‌ట్టుకుంటోంది. రిల‌య‌న్స్ సంస్థ చిత్తూరులో ఇచ్చిన భూములు తిరిగిచ్చేసి వెళ్లిపోయింది. ల‌ల్లూ గ్రూపు మొద‌ట్లోనే మేం రాం అని చెప్పేసింది. మ‌రి, సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఎక్క‌డ ల‌భిస్తున్న‌ట్టు? ప్ర‌భుత్వ‌మే స‌హ‌క‌రించి ఉంటే అమ‌ర‌రాజా కంపెనీకి ఇప్పుడీ క‌ష్టాలు వ‌చ్చేవా? అని ప్ర‌శ్నిస్తున్నారు. 

ఇక ఏపీ ఎగుమ‌తులు రెండేళ్ల‌లో 19.43 శాతం వృద్ధి చెందాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారంటే ఆ మేర‌కు అధికారిక లెక్క‌లు ఉండే ఉంటాయి. అయితే, ఆ ఎగుమ‌తులు జ‌రిగిన‌వి అంత‌కుముందే ఉన్న కంపెనీల నుంచే గానీ, జ‌గ‌న్ త‌ర్వాత ఏపీకి కొత్త‌గా ఎగుమ‌తులు చేసే కంపెనీలు వ‌చ్చింది లేద‌ని గుర్తు చేస్తున్నారు. అందులో ఈయ‌న గారి గొప్ప‌త‌నం ఏమీ లేద‌ని.. అయినా త‌మ ప్ర‌భుత్వం వ‌ల్లే ఎగుమ‌తులు పెరిగాయ‌నే విధంగా గొప్ప‌లు చెప్పుకున్నార‌ని అంటున్నారు. ఇక కొత్తం కంపెనీలు, పెట్టుబ‌డులే లేన‌ప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొద‌టి స్థానంలో ఎలా ఉందో జ‌గ‌నే వివ‌రించాల‌ని వేడుకుంటున్నారు. వాణిజ్య ఉత్స‌వం పేరుతో వేడుక‌లు జ‌రుపుకోవాల్సినంత ఘ‌న‌కార్యం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. మ‌రెందుకు ఇంత‌టి ఆడంబ‌రమ‌ని జ‌నం నిల‌దీస్తున్నారు.