డబ్బులు ఇవ్వలేదని కూలీల ధర్నా... వైఎస్ షర్మిల అరెస్ట్..

హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాలను పరామర్శిస్తూ అక్కడే దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా బోడుప్పల్ వచ్చారు షర్మిల. అయితే దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల యత్నించగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు షర్మిలను రెస్ట్ చేసి మేడిపల్లి స్టేషన్ కు తరలించారు.

పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అటూ ప్రతిపక్షాల ముందుకు వస్తున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ లో ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం పరామర్శించరా? అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని  రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

మరోవైపు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రికత కొనసాగుతుండగానే.. అడ్డా కూలీల ఆందోళనకు దిగారు. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వలేదని వారు దీక్ష స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీరా వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.

Related Segment News