రెండు రాష్ట్రాల సమస్య.. ఉల్లిపాయ తీర్చిందా?

 

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రాంతీయ బేధాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండేవి. కాని రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఏదో గొడవ. ప్రతి చిన్నవిషయానికి గిల్లి కజ్జాలు చేసుకుంటున్నాయి. నీటి విషయంలో.. ఉద్యోగుల పంపిణీ విషయంలో ఇంకా అనేక విషయాల్లో రెండు రాష్ట్రాలు తరుచూ గొడవ పడుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న సమస్యలను తీర్చడానికి అటు గవర్నర్.. ఇటు కేంద్రం కూడా ప్రయత్నించింది కాని లాభం లేకుండా పోయేది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సమస్యను ఉల్లిపాయ తీర్చింది. ఉల్లిపాయ ఏంటీ సమస్యను తీర్చడమేంటి అనేగా డౌట్.

అసలు విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ పై రవాణా పన్ను విధించిన సంగతి తెలిసిందే. దానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి పన్ను విధించవద్దని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పన్ను విధించింది. దాంతో ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వంపై రవాణా పన్ను వేసింది. దీంతో ప్రభుత్వాల సంగతేమో కాని దీనివల్ల రెండు రాష్ట్రాల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రంలో ఉల్లిపాయ ధరలు పెరుగడంతో తెలంగాణ ప్రభుత్వం రావాణా పన్నుతో ఇబ్బందులు పడుతోంది. అదెలా అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉల్లి విక్రయాలు దాదాపు కర్నూలు రైతుల నుండే జరుగుతాయి. ఈనేపథ్యంలో ఏపీకీ రవాణా పన్ను వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వచ్చిన సమస్యల్లా తెలంగాణా ప్రభుత్వానికే..  కిలో ఉల్లి పై రూ.6 వరకు రవాణా భారం పడుతోందట.. కానీ రైతు బజార్లలో రూ.20 కే ప్రభుత్వం కిలో ఉల్లిని ఇస్తుండడంతో ఈ రవాణా భారం కూడా నేరుగా ప్రభుత్వంపైనే పడుతోంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వానికి జ్ఞానోదయమై ఏపీ ప్రభుత్వంతో రవాణా పన్నుపై సంప్రదింపులు జరిపారు. ఏపీ అధికారులతో చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్ర వాహనం రెండో రాష్ట్రంలో ప్రవేశిస్తే రూ.5 వేలు చెల్లించాలి.. ఆఖరికి ఏడాదికి మొత్తం మీద ఎన్నివాహనాలు తిరిగాయో లెక్కించి దాని ప్రకారం ఆ సొమ్మును రెండు రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలి.. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం. అయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రల అధికారులు చర్చించుకున్నా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. అంతా ఒకే అయితే అక్టోబరు 1 నుంచి ఈ ప్రోసెస్ ను రెండు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను ఎవరూ తీర్చలేకపోయినా ఉల్లిపాయ తీర్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu