బస్టాండ్ లోనే మహిళకు నిప్పు

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. బస్డాండులోనే ఓ మహిళకు నిప్పంటించాడు దుండగుడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం రోజుకూలీ అయిన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తూ బస్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపైనే నివసించేవారు. ఈ క్రమంలో కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా మెలగుతుండడాన్ని చూసి ముత్తు జీర్ణించుకోలేకపోయాడు

అతడితో సన్నిహితంగా ఉండడం మానుకోవాలని ముత్తు పలుమార్లు శాంతిని హెచ్చరించాడు. అతడి మాటలను ఆమె పట్టించుకోకపోవడంతో మరింత రగిలిపోయిన ముత్తు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బస్టాండ్‌ని ప్లాట్‌ఫాంపై గత రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన ప్రయాణికులు వెంటనే తేరుకుని మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
చెన్నై బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.