ఏపీ మద్యం కుంభకోణం.. సిట్ దర్యాప్తు తుది అంకానికి?
posted on Sep 6, 2025 10:11AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందా? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది సిట్ గుర్తించిందా? అంటే సిట్ దూకుడు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. తాజాగా జగన్ సోదరుడు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే అనిల్ రెడ్డి పిఏ దేవరాజులును సిట్ మూడు రోజుల పాటు విచారించింది. అతడి ద్వారా మద్యం కుంభకోణం సొమ్ము అంతిమంగా ఎక్కడకు చేరిందన్న కూపీ లాగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేప థ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ చివరి అంకానికి తీసుకువచ్చిందని అంటున్నారు.
అంతిమ లబ్ధిదారును గుర్తించి అరెస్టు చేస్తే కేసు దర్యాప్తు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలోనే సిట్ మద్యం కుంభకోణం కేసులో మూడో చార్జిషీట్ దాఖలు చేయడానికి సమాయత్తమౌతున్నదని చెబుతు న్నారు. జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సేకరించిన ఆధారాలను దేవరాజులు ముందు పెట్టి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో దేవరాజులు మద్యం కుంభకోణం సొమ్ము ఎక్కడకు ఎలా చేరిందన్న విషయాన్ని సిట్ అధికారులకు పూసగుచ్చినట్లు చెప్పేశారని అంటున్నారు. మూడు రోజుల పాటు దేవరాజులును సిట్ విచారించిన విషయం శుక్రవారం (సెప్టెంబర్ 5) వెలుగులోనికి వచ్చింది. దీంతో వైసీపీలో ఖంగారు, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.