కేంద్రం చెబుతున్నా మంకు పట్టు వీడని జగన్...మళ్ళీ అదే తీరు !

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని సంచలనంగా మారుతున్నాయి. ఎలా అయినా చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఆయన చేయని పని లేదు. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఖచ్చితంగా అవినీతిని బయట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు. ఈ మధ్యనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ సీఎం జగన్‌కు రెండోసారి కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. పీపీఏల పున:సమీక్షపై ఆలోచించాలని కేంద్ర మంత్రి ఆర్‌కేసింగ్‌ లేఖ రాయగా, జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గబోమని అంటున్నారు. 

కేంద్ర ఇందన శాఖ మంత్రి రాసిన లేఖకు వివరణ ఇస్తామని సీఎం సలహాదారు అజయ్‌ కల్లం చెబుతున్నారు. అధిక ధరలకు పీపీఏలు కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పందం పారదర్శకత తేల్చనున్నామని, గత ఐదేళ్లలో నాటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్షించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న అన్ని అంశాలపైనా సమీక్షించి, అక్రమాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

2018-19 నాటి ఆర్థిక సర్వేలో పవన, సౌరవిద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్రం పేర్కొందని మాజీ సీఎస్ గుర్తుచేశారు. 2010లో యూనిట్‌ ధర రూ.18 ఉంటే 2018 నాటికి రూ.2.44కు పడిపోయిందని, 2017 నాటికి పవన విద్యుత్‌ యూనిట్‌ సగటు ధర రూ.4.20 నుంచి 2.43కు తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పీపీఏ ప్రకారం యూనిట్‌కు రూ.4.84 చెల్లిస్తున్నారని, ఇదే సమయంలో థర్మల్‌, జల విద్యుత్‌ రూ.4.12కే అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ అందుబాటులో ఉంటే రూ.4.84 చెల్లించి పవన విద్యుత్‌ కొనాల్సిన అవసరమేంటి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.