జూలై 30న సీబీఐకి శీలపరీక్ష.. జగన్ బెయిల్ కేసుపై ఉత్కంఠ 

రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించడమే కాదు, అలా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం కూడా అవసరమే. కాదంటే, వ్యవస్థల పట్ల ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది. సంస్థలు అపవాదులను మోయవలసి వస్తుంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సీబీఐ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మోస్తున్న అపవాదులు చాలావన్నట్లుగా కొత్త తప్పులు తలకు చుట్టుకుంటోంది. గతంలో ఎప్పుడోనే భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు, సీబీఐని, సర్కార్ పలుకులు పలికే ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది. 

ఒకప్పుడు సీబీఐ అంటే, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ గా ప్రసిద్ధి చెందింది. అప్పటి విపక్షాలు ఆ విధంగా ఆరోపించాయి. అలాగే, ఇప్పుడు, కాంగ్రెస్ సహా  ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో సీబీఐ కీలుబొమ్మని ఆరోపిస్తున్నాయి. నిజానికి, అప్పుడైనా, ఇప్పుడైనా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అనేది, మెజారిటీ ప్రజల అభిప్రాయం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఆయన బెయిలు రద్దుకు సంబందించి సొంత పార్టీ, వైసీపీ రెబెల్ ఎంపీ దాఖలు చేసిన కేసులో అలాగే,ముఖ్యమంత్రి సొంత బాబాయి, వైఎస్ వివేకానంద మర్డర్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని సామాన్య ప్రజలు కూడా సందేహలు వ్యక్తపరుస్తున్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు, ప్రొసీజర్ పాటిస్తూ. అటు నిందితుడు జగన్మోహన్ రెడ్డిని, పిటీషన్ వేసిన రఘురామ కృష్ణం రాజును అలాగే, ఈ కేసును పుష్కర కాలానికి పైగా విచారిస్తున్నసీబీఐని కౌంటర్ దాఖలు చేయమని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబందించి నిందితుడు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు, రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా  కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. ముందు, ఇదిగో అదిగో అంటూ ఒకటి రెండు వాయిదాలు కోరింది. చివరకు  మీ ఇష్టం చట్టం ఎలా చెబితే ఆలా చేయండి అంటూ భారాన్ని కోర్టుకు వదిలేసింది. 

మళ్ళీ తూచ్ ... మేము కూడా  లిఖిత  పూర్వకంగా మా వాదన వినిపిస్తామంటూ .. జూలై  14న కోర్టును సీబీఐ కోరింది. అందుకు  పది రోజులు గడవు కోరింది. అన్నిటికీ ఓకే చెప్పిన సీబీఐ న్యాయస్థానం, ఈ నెల (జూలై)26కు విచారణ వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశం, అని కూడా కొంచెం చాలా గట్టిగానే చెప్పింది. అయినా జూలై 26 సోమవారం సీబీఐ సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. సీబీఐ అధికారికి   జ్వ‌రంగా ఉన్నందున విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని, కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని సీబీఐ లాయ‌ర్లు కోర్టును కోరారు. దీంతో సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.ఈ వ్యవహారం చూస్తుంటే ఏదో విధంగా జగన్ రెడ్డి బెయిలు రద్దు పిటీషన్’పై తుది తీర్పు సాధ్యమైనంత వరకు వాయిదా వేయలనేదే సీబీఐ సంకల్పంగా, అందుకోసమే ఇన్ని అడ్డదారులు తొక్కుతోందనే అనుమానాలు బల పడుతున్నాయి. 

రేపు జూలై 30న మరో మెలిక పెట్టి మళ్ళీ వాయిదా కోరితే, అదే నిజమని అనుకోక తప్పదు. ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయిన సంస్థ మరింతగా విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతే కాదు, ఒక్క సీబీఐ మాత్రమే కాదు, సీబీఐ ని వెనకనుంచి నడిపించే కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇప్పటికే, బీజేపీ, వైసీపీల మధ్య చీకటి బంధం ఉందన్న ఆరోపణఉండనే వుది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు.అందుకే జూలై 30న సీబీఐ శీల పరీక్షను ఎదుర్కుంటోందని అంటున్నారు. 

ఇక జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో విచారణ అధికారిని బదిలీచేయడం కూడా, సీబీఐ ఎవరికైనా కొమ్ము కాస్తోందా అనే అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది.