కేసీఆర్ కోసం కొత్త ఫామ్‌హౌజ్‌.. ఆ గ‌ట్టు మీదే ఉంటారా? ఆ టార్గెట్ కోస‌మేనా?

కేసీఆర్ ఇల్లెక్క‌డుందో చాలా త‌క్కువ మందికే తెలుసు. కేసీఆర్ ఉండేది ఎక్క‌డో అంద‌రికీ తెలుసు. పెద్దిల్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌.. చిన్నిల్లు గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌. రెండు ఇండ్ల సంసారం ముఖ్య‌మంత్రిది. నందిన‌గ‌ర్‌లో ఉండే ఆయ‌న సొంతింటికి వెళ్లి చాలా ఏండ్లే అయ్యింది. తాజాగా, సీఎం కేసీఆర్ మ‌రో కేరాఫ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ గ‌ట్టు మీద కుర్చీ వేసుకొని కూర్చొనేందుకు రెడీ అవుతున్నారు. ఆ మేర‌కు ఆస్థాన వాస్తు పండితుడు సుద్దాల సుధాక‌ర్‌తేజ.. ఇంటి స్థ‌లాన్ని ప‌రిశీలించి వ‌చ్చారు. ఓ శుభముహుర్తాన కేసీఆర్ కొత్త‌ ఇంటికి శంకుస్థాప‌న ప‌డ‌నుంది. ఇంత‌కీ, ఆయ‌న‌కు ఇప్ప‌టికిప్పుడు ఇంకో ఇంటి అవ‌స‌రం ఏమొచ్చింది? ఇంత‌కీ ఆ లొకేష‌న్ ఏంటి? 

కేసీఆర్ మాట‌లు చెబుతారే గానీ.. చేత‌ల్లో చూపించ‌రనే ఆరోప‌ణ‌ ఉంది. కేసీఆర్ కోత‌ల రాయుడనే విమ‌ర్శ ఉంది. ఆయ‌న చెప్పే మాట‌లు, చేసే ప‌నులు కూడా అలానే ఉంటాయ‌నుకోండి అది వేరే విష‌యం. తాజాగా, తెలుగురాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం తీవ్ర స్థాయిలో న‌డుస్తోంది. మంత్రులు తిట్ల దండ‌కంతో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల మోహ‌రింపుతో ఉద్రిక్త‌త‌లు పెంచేస్తున్నారు. కేంద్రానికి, ట్రైబ్యున‌ల్‌కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఏపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేస్తే.. పాల‌మూరు ఇక ఎడారే అంటోంది తెలంగాణ‌. జ‌గ‌న్ దూకుడుకు భ‌య‌ప‌డో, మ‌రే కార‌ణ‌మో కానీ.. ఏళ్లుగా ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న‌ప‌డేసిన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఇప్పుడిప్పుడే ఫోక‌స్ పెడుతున్నారు. గ‌తంలో ఆ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు తాను అక్క‌డే కుర్చీ వేసుకొని కూర్చుంటానంటూ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పాల‌మూరుకు వెళ్లిన ప్ర‌తీసారి కేసీఆర్ ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. కానీ, ఇంత వ‌ర‌కూ అక్క‌డ ఒక్క కుర్చీ కూడా వేసింది లేదు. తాజాగా, కుర్చీ ఏం ఖ‌ర్మ‌.. ఏకంగా గెస్ట్‌హౌజ్ క‌ట్టుకొని అక్క‌డే తిష్ట వేస్తాన‌ని.. ప్రాజెక్టు పూర్తి అయ్యే వ‌ర‌కు అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని కేసీఆర్ క‌మిట్ అయ్యార‌ట‌. వెంట‌నే ప్రాజెక్ట్ సమీపంలో త‌న‌కో గెస్ట్‌హౌజ్ నిర్మించాలంటూ ఇటీవ‌ల‌ అధికారుల‌ను ఆదేశించార‌ట‌. 

సీఎం కేసీఆర్ గెస్ట్‌హౌజ్‌ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఓ స్థ‌లం చూశారు. అదెలా ఉందో చూసి ర‌మ్మంటూ త‌నకెంతో న‌మ్మ‌క‌మైన‌ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాక‌ర్ తేజ‌ను కోరార‌ట కేసీఆర్‌. ఆ మేర‌కు ఇటీవ‌ల సుద్దాల.. భూత్పూర్ మండలంలో పర్యటించారు. కరివెన ద‌గ్గ‌ర‌ నిర్మాణంలో ఉన్న కురుమూర్తిరాయ ప్రాజెక్టు దగ్గర గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్థ‌లాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆ స్థ‌లం వాస్తుకు అనుగుణంగా ఉందో లేదో అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్‌కు అందించ‌నున్నారు సుద్దాల సుధాక‌ర్‌తేజ‌. కేసీఆర్ ఆమోదం తెలిపితే.. వెంట‌నే గెస్ట్‌హౌజ్ నిర్మాణం మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. ఆ గ‌ట్టుపై ఉన్న‌ గెస్ట్ హౌస్‌లోనే కేసీఆర్ ఉంటార‌ని.. అక్క‌డి నుంచే ప్ర‌భుత్వ‌ పరిపాలన కార్యక్రమాలు, ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తార‌ని అంటున్నారు. ఆ లెక్క‌న త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ అడ్ర‌స్ మారిపోనుంద‌న్న మాట‌. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉంటేనే ఎవ‌రికీ అందుబాటులో ఉండ‌ని ముఖ్య‌మంత్రి.. ఇక‌పై పాల‌మూరు షిఫ్ట్ అయితే ఆ మాత్రం కూడా క‌నిపించ‌రేమో...అంటున్నారు.