జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం వెనుక ? సీబీఐ సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది?

2011లో నమోదైన జగన్ అక్ర‌మ ఆస్థుల కేసుపై  రెండేళ్లలో ద‌ర్యాఫ్తు పూర్తి చేసిన సీబీఐ, 2013లోనే  ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జిషీట్లపై విచారణలో ఎలాంటి పురోగతి లేద‌ని, వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణంరాజు పిటీష‌న్‌పై  విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు సీబీఐకి చీవాట్లు పెట్టింది. కోర్టు చీవాట్ల‌తో క‌దిలిన‌ సీబీఐ, ఈ కేసు తాజా పరిస్ధితిపై సుప్రీంకోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చింది.  2013లో చివరి ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నుంచి,  ఇప్ప‌ట్టి వ‌ర‌కు జ‌రిగిన పరిణామాల‌న్నింటినీ క్షుణ్ణంగా వివరించింది. 

1) విచారణను అడ్డుకునే లక్ష్యంతోనే, నిందితులు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 
2) నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లలో ఒకటి హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
3) నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు.  నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.  
4) ఏదో ఒక కారణం చూపుతూ కింది కోర్టులో విచారణ ప్రక్రియ సాగకుండా, తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పిందని సీబీఐ పేర్కొంది.  కేసుల విచారణలో జాప్యానికి కారణం, కోర్టులు కాదని.... అందుకు పిటిషనర్, ఇతర నిందితులే కారణమని ఆ తీర్పులో ఉన్నత న్యాయస్థానం చెప్పినట్లు సీబీఐ పేర్కొంది. 
5) క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను విచారించి సీబీఐ కోర్టు తీర్పులివ్వకముందే జడ్జీలు బదిలీ అయిపోయారు. ఇలా ఆరుగురు జడ్డీలు బదిలీ అయ్యారు. 
6) ఈ పిటిషన్లను విచారించిన చివరి న్యాయమూర్తి సైతం కనీసం రెండేళ్లు కూడా కాకుండానే బదిలీ అయ్యారు. 
7) జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొత్తం 911 మంది సాక్ష్యులున్నారు. వారంతా 50 ఏళ్ల పైబడిన వాళ్లే.  కాబట్టి పిటిషనర్ రఘురామ కోరినట్లుగా ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని సీబీఐ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.  విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే సాక్ష్యులకు ఇబ్బందులు తప్పవని సీబీఐ తెలిపింది. 
8) ప్రస్తుతం సీబీఐ కోర్టులో ఉన్న న్యాయమూర్తులు సరిపోవడం లేదు. అదనపు న్యాయమూర్తులను కేటాయించి, రోజువారీ విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.  విచారణ వేగంగా జరగాలంటే సీబీఐ కోర్టులో ఖాళీలు భర్తీచేయాలి. 
9) ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పగించాలి.  జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు  ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. 
10) ప్రస్తుతం హైదరాబాద్ సీఐబీ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారు.  ప్రస్తుతం అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతలనూ ఒకే ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారని సీబీఐ తెలిపింది. 
ప్రిన్సిపల్ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసుపై రోజువారీగా విచారణ చేపట్టారు.  
ఎమ్మార్, వివేకానందరెడ్డి హత్యలాంటి సున్నిత కేసులతోపాటు, హైదరాబాద్ లోని సీబీఐ, ఏసీబీ విభాగం, బెంగుళూరులోని సీబీఐ బీఎస్ఎఫ్‌బి విభాగం, చెన్నైలోని సీబీఐ ఈఓడబ్ల్యూ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులనూ ప్రిన్సిపల్‌ జడ్జే విచారిస్తున్నారు. 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు, ప్రిన్సిపల్ జడ్జి కోర్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను రోజువారీగా విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలి. 
11) ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో.... 911 మంది సాక్షులు, లక్షల పేజీలున్న 1,671 డాక్యుమెంట్లు ఉన్నాయి.  వాటన్నింటినీ ట్రయల్ కోర్టు పరిశీలించి విచారించాల్సి ఉంది. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌