ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
posted on Jun 29, 2025 6:55PM
.webp)
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు అయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణను చేపట్టనున్నారు. మంగళవారం అంటే.. జులై 1వ తేదీన కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనేది ఒక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం వాటిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.
ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మాత్రం జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి.. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక బీజేపీ నేత, ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి.. లోక్ సభ సభ్యురాలుగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేర్లు అధ్యక్ష పదవికి వినిపిస్తున్నాయి