ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం
posted on Dec 17, 2015 8:50AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అంతకుముందు వైసీపీ నాయకుడు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి రవీంద్రభారతి నుంచి శాసనసభ వరకు ప్రదర్శనగా వచ్చారు. కాల్‌మనీ అంశం మీద వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, ప్రతిపక్షం సభ నిర్వహణకు సహకరించాలని, కాల్‌మనీ వ్యవహారం మీద శుక్రవారం నాడు చర్చిద్దామని అన్నారు.