వాళ్ల అనుమతి అవసరమా?
posted on Mar 18, 2015 3:52PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో మాట్లాడుతూ పోలవరానికి రూ. 10,451 కోట్లు కావాలని అన్నారు. ఈ నెల 16న పోలవరం అధారిటీ సమావేశం జరిగిందని, అధారిటీ ప్రతిపాదనలు ప్రతి పక్షానికి అందజేస్తామని ఆయన తెలిపారు. కృష్ణా మిగులు జలాలు వినియోగంలోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని, మిగులు జలాలు అవసరం లేదని వైఎస్ ట్రైబ్యునల్ కు రాయడం వారి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. పట్టిసీమ టెండర్లలో నిబంధనలు పక్కాగా ఉన్నాయని, ఒప్పందం ప్రకారం పనులు పూర్తయితేనే అదనపు కోట్ నిధులిస్తామన్న నిబంధన ఉందన్నారు. ఒకవేళ ఏడాదిలోపు పూర్తి చేయకపోతే 17 శాతం బోనస్ ఇవ్వమని చెప్పామని చంద్రబాబు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, దానిని సమర్ధిస్తున్న వారికి చురకలు వేశారు. అయినా పట్టిసీమకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరమా? సముద్రంలోకి పోయే నీళ్లను మేము వాడుకోకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్ధించే స్థాయికి మీరు వచ్చారా అని ప్రతి పక్షాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు అవసరమైన అన్నింటినీ సమకూర్చామని, ఏడాదిలోపు పట్టిసీమను పూర్తిచేసి తీరతామన్నారు. కాంట్రాక్టుల కోసమే 2005లో పోలవరం లాంటి ప్రాజెక్టులు చేపట్టారని, పట్టిసీమ ఆలోచన అప్పుడే వచ్చి ఉంటే 9 ఏళ్లు రాయలసీమకు నీళ్లందేవని అన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారుచేస్తానని తెలిపారు.