తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో వికెట్ డౌన్?

తెలంగాణ కాంగ్రెస్ కు ఏదో అయ్యింది. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా.. ఆ మేరకు కాంగ్రెస్ పుంజుకోవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు.. సరికదా ఉన్న పట్టును కూడా కోల్పోయి రోజు రోజుకూ మరింత బలహీనమౌతోంది. పార్టీ  నాయకులు ఒక్కరొక్కరుగా దూరమౌతున్నారు. ఉన్న వారు కూడా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు అవకాశాలున్నప్పటికీ, పరిస్థితులు కూడా కలిసివచ్చేలా ఉన్నప్పటికీ  నాయకత్వంలో ఐక్యతా లోపం ఆ అవకాశాలను వినియోగించు కోలేక పోవడమే కాకుండా చేజార్చుకుని రోజు రోజుకూ బలహీనమైపోతోంది.  ఇక ఇప్పటి దాకా గట్టి పట్టు ఉందని అంతా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. గ్రేటర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు.

అలా దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని చెప్పుకుం టున్న కమలం గూటికి చేరుతున్నారు. అసలు గ్రేటర్ కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చేది పిజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వీరిద్దరికీ అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ గా విశేష గుర్తింపు ఉండేది. సరే పీజేఆర్ ఇప్పుడు లేరు. కానీ ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా నిన్న కాక మొన్న కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరిపోయారు.

ఇప్పుడు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా తన తండ్రికి స్నేహితుడైన మర్రి శశిథర్ రెడ్డి వెంటే కమలం గూటికి చేరనున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కూడా మర్రిశశిథర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు అందుకున్న తరువాత పార్టీలో ముఖ్యంగా గ్రేటర్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందన్న భావన అందరిలోనూ ఉంది.

అన్నిటికీ మించి తన సోదరి విజయారెడ్డిని తన అభీష్ఠానికి వ్యతిరేకంగా, కనీసం తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లోనే తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయనలో అదే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే పీజేఆర్ వారసుడిగా ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోందంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ద్వారానే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.