కేసీఆర్ చెక్కులు చెల్లలేదా!?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు తెలంగాణ సీఎం ఆర్థిక సహాయం అంటూ పంపిణీ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయా? ఆ చెక్కులు చెల్లలేదా? అంటే ఔననే అంటున్నాయి ఆ చెక్కులు తీసుకున్న రైతు కుటుంబాలు.      కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీంతో కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేసి మరీ పంపిణీ చేసిన చెక్కులు చెల్లనివా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఆరంభమైంది.

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతు బాంధువుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ చేసిన ఆర్థిక సహాయం ప్రచారార్భాటం కోసమేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.   మేలో కేసీఆర్ ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ 1010 చెక్కులను పంపిణీ చేశారు. అవే ఇప్పుడు చెల్లలేదంటూ కొందరు మీడియాకు తెలిపారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేసీఆర్ పంపిణీ చేసిన 1010 చెక్కులలో 814 చెక్కులకు నగదు చెల్లింపులు పూర్తయ్యాయని స్పష్టం చేసింది. అంటే మిగిలిన చెక్కులు చెల్లలేదని ప్రభుత్వమే అంగీకరించినట్లైంది.

అయితే ఆ చెక్కులు చెల్లక పోవడానికి ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని టీఆర్ఎస్ వివరణ ఇస్తోంది.  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనీ, అలా చేయకపోవడం వల్లనే  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదనీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి చెక్కులకు కూడా చెల్లింపులుచేయాలని తాము ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

ఇంకా ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే   ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రాంసింగ్ ను సంప్రదించాలని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే అయినా.. పరాయి రాష్ట్రంలో వారికి ఆర్థిక సహాయం కింద చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో మాత్రం లేదని ప్రభుత్వం చెబుతోంది.  మొత్తం మీద కేసీఆర్ చెక్కులు చెల్లలేదంటూ వచ్చిన వార్తలు కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టాయి. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఇచ్చిన చెక్కులన్నీ చెల్లుబాటు అవుతాయని  ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సాంకేతిక పొరపాటుతోనే కొన్ని చెల్లుబాటు కాలేదని సర్కారు చెప్పుకుంది.

రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ ఏడాది మే 22న 1010 చెక్కులను పంపిణీ చేసిన సంగతి విదితమే.  ఈ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని తాజాగా మీడియాలో వార్తలు రావడంతో   తెలంగాణ ప్రభుత్వం తక్షణం   విచారణ జరిపించింది. ఆ విచారణలో  బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం   చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్  చేయకపోవడం వల్ల  కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు జరగలేదని తేలింది.  వాటిని రీవాలిడేట్ చేసి నగదు చెల్లింపులు పరపాలని  ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. .