ఫార్మ్ హౌస్ కథలో మరో ట్విస్ట్... ఏమిటో తెలుసా?

అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన కుట్ర చుట్టూ అల్లుకున్న ఫార్మ్ హౌస్  కథ .. మరో కంచికి చేరని కథలా ముందుకు సాగుతోందా? ముగింపు లేని మరో ఓటుకు నోటు కథలా కాలగమనంలో  తెరమరుగై పోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే  ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి, నందకుమార్ కు రాష్ట్ర హై కోర్టు షరతులతో కూడిన బెయిల్  మంజూరు చేసింది. ముగురు నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు. సరే  రాష్ట్ర పోలీసులు వారిని వేరే కేసుల్లో మళ్ళీ ఆరెస్ట్ చేశారనుకోండి అది వేరే విషయం. ఈ కేసుకు సంబంధించినంత వరకు అయితే, ఆ ముగ్గురు బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు.  

మరోవంక  కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్  కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే బిఎల్ సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై రివిజన్ పిటిషన్ వేసిన సిట్ కోర్టు వ్యాఖ్యలను హైకోర్టులో  సవాల్ చేసింది. ఆ కేసు నడుస్తోంది. ఎప్పటికి తేలుతుందో, ముగింపు ఎలా ఉంటుందో తెలియదు.
ఫార్మ్ హౌస్ కేసు విచారణకు సంబందించిన వ్యవహారం అలా ఉంటే  ఈ కేసుకు సంబందించి బీజేపీ సీనియర్ నాయకడు బీఎల్ సంతోష్  ను సిట్  నిందితుల జాబితాలో చేర్చింది.

ఈ  కేసులో ఆయనే సూత్రధారి అని చెపుతోంది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీఎల్ సంతోష్ న్యాయస్థానాలకు వెళ్లి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. ఈలోగా సిట్  కు ఈ కేసు విచారించే అధికారమే లేదని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. ఏసీబీ కోర్టు తేర్పుపై  రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది  ఈ కేసుల్లో ఇంకా విచారణలు జరుగుతున్నాయి. 

అయితే  ఇప్పడు బిఎల్ సంతోష్ హైదరాబాద్ వస్తున్నారు.హైదరాబాద్ లో  డిసెంబర్  28,29 తేదీలలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ వస్తున్నారు.  దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్ సభ నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు  పార్టీ బలోపేతం  ప్రచార శైలిపై కార్యకర్తలకు నేతలు శిక్షణ ఇవ్వనున్నారు.  

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు తెలంగాణ వ్యూహ రచనలు చేస్తోంది. దీంతో ఆ పార్టీ తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడే పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ్గా.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కార్యకర్తల సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గోనేందుకే, సంతోష్ హైదరాబాద్ వస్తున్నారు.

సరే అదెలా ఉన్నా బీఎల్ సంతోష్ హైదాబాద్ వచ్చిన సందర్భంగా, తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సిట్  ఏమి చేస్తుంది. పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమి జరుగుతుంది  అనేది రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది. సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. విఫల మయ్యారు. ఇప్పుడు సంతోష్ హైదరాబాద్ కే వస్తున్న నేపధ్యంలో పొలిటికల్ డ్రామా ఏ మలుపు తిరుగుతుందననది  ఆసక్తికరంగా మారింది.