రాహుల్ భారత్ జోడో యాత్ర.. వాట్ నెక్ట్స్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. పార్టీ ఎన్నికల వైఫల్యాలతో సంబంధం లేకుండా రాహుల్ తన యాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో ఘోర పరాజయం,  ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో తేరుకోలేని ఎదురుదెబ్బ వీటిని వేటినీ రాహుల్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరికొన్ని రోజుల్లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. మరి యాత్ర ముగిశాక వాట్ నెక్స్ట . ఈ ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.

రాహుల్ యాత్ర కారణంగా ఆ యాత్ర సాగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్న సూచన లేదు. మరి యాత్ర ఉద్దేశం నెరవేరినట్లేనా. ఎంత ఎన్నికల రాజకీయాలతో సంబంధం లేని యాత్ర అని రాహుల్ బలంగా చెబుతున్నా..పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనొం చేకూర్చిన యాత్ర ఎందుకు చేపట్టినట్లు అన్న ప్రశ్నకైనా ఆయన  ఇప్పుడుకాకపోతే తరువాతైనా సమాధానం చెప్పుకోక తప్పదు. అది అలా ఉంచితే.. రాహుల్ భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ  ప్రణాళిక ఏమిటి? మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత ఆయనపైనే పడినా, పార్టీ మనుగడ సాగించాలన్నా.. ప్రజలలో కొద్దో గొప్పో ఆదరణ, గౌరవం దక్కాలన్నా కాంగ్రెస్ కు ఇప్పటికీ గాంధీ కుటుంబమే దిక్కు. అందుకే రాహుల్ గాంధీ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ఆశలూ పెట్టుకుంది.  ఇప్పటికే పాతిక వందల కిలోమీటర్ల పైన సాగిన రాహుల్ పాదయాత్ర ఏడు రాష్ట్రాలను చుట్టేసింది.  మరో వెయ్యి కిలోమీటర్లపైన యాత్ర మిగిలి ఉంది. అది పూర్తి అయితే  రాహుల్ నిర్దేశించుకున్న  కన్యాకుమారి నుంచి కశ్మీర్ లక్ష్యం నెరవేరినట్లే.

ఇంత వరకూ ఓకే కానీ యాత్ర తరువాత వాట్ నెక్ట్స్.. రాహుల్ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేంద్రంలోని బీజేపీని ఎలా ఎదుర్కొంటుంది? ఇంత కాలం కేంద్రంలోని మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా పార్టీ  పరిస్థితి రోజు రోజుకూ బలహీనమౌతున్న సూచనలే కనిపిస్తున్నాయి. హిమాచల్  అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినా.. అది పార్టీలో పెద్దగా ఉత్సాహాన్ని నింపలేదు. ఎందుకంటే అధికార పార్టీకి మరో సారి అధికారం కట్టబెట్టక పోవడమన్నది హిమాచల్ సంప్దాయంగా వస్తోంది. దీంతో ఇక్కడి గెలుపు కాంగ్రెస్ తన సొంత ప్రతిభగా క్లెయిమ్ చేసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. కానీ గుజరాత్ లో పరాజయం మాత్రం ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీసిఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే.. వరుసగా ఏడో సారి గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పుంజుకోవడం సంగతి అటుంచి గతం కంటే బలహీన పడింది.

ఈ నేపథ్యంలోనే కనీసం  రాహుల్ భారత్ జోడో యాత్రతో ఆయన వ్యక్తిగతంగానైనా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా జనామోదాన్ని పొందారా? పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా అర్హత సాధించారా? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం పార్టీ శ్రేణుల నుంచే రాలేదు.   భారత్ జోడో యాత్రతో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది, బీజేపీకి దీటుగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నిలబడే బలం సమకూరుతుంది  అని ఆశలు పెట్టుకున్న  కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ ముగింపు దశకు వస్తున్నప్పటికీ ఆ ఆశలు నెరవేరుతాయన్న విశ్వాసాన్ని పొందలేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.   

కొత్త సంవత్సరంలో సరికొత్తగా రాజకీయాలు చేసేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోందని మాత్రం పార్టీ హైకమాండ్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. వచ్చే ఏడాది  ఫిబ్రవరి రెండవ వారంలో  మూడు రోజులపాటు సాగే కాంగ్రెస్ ప్లీనరీ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా దిశానిర్దేశం చేస్తుందని చెబుతున్నది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ వరుస యాత్రలకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 ఇందులో భాగంగా  హాత్ సే హాత్ జోడో అభియాన్  అంటూ జనవరి 26 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమైంది.   బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్, స్టేట్ లెవెల్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్    పాదయాత్ర భారీ ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ పాదయాత్రలో యువతను పార్టీతో కనెక్ట్ చేస్తూ ఉత్సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహించనుంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర సాగనుంది.  మొత్తానికి ఓవైపు బీజేపీ 2024 ఎన్నికల సన్నాహకాలు జోరుగా చేస్తుంటే మరోవైపు బీజేపీకి దీటుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ కాంగ్రెస్ కూడా   కసరత్తులు చేస్తున్నది. ఇది ఏ మేరకు సక్సస్ అవుతుందన్నది చూడాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.