షర్మిల మైలేజీని పెంచే వ్యూహమేనా?

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అయినా, సజ్జల సమైక్యరాగమైనా.. ఈ రెండూ అనేమిటి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి పొలిటికల్ మూవ్ కూ ఆమె లింక్ ఉందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రను అడ్డుకోవడం నుంచి.. ప్రగతి భవన్ కు వెళ్లే దారిలో ఆమెను కారులో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించడం దాకా.. కోర్టు అనుమతి ఇచ్చినా  షర్మిల పాదయాత్ర కొనసాగించలేని పరిస్థితి నుంచి.. ట్యాంక్ బండ్ పై నిరసన వరకూ.. ఇంటి ముందు కూడా నిరసనకు అంగీకరించకపోవడం నుంచి విజయమ్మ సైతం నిరశనకు దిగడం వరకూ అన్నీ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి షర్మిలనే తమ బాణంగా ఎంచుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

అసలు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఎవరికీ పట్టని పాదయాత్రను తెలంగాణలో నిరాటంకంగా సాగిస్తున్నప్పటి నుంచీ కూడా షర్మిల ఎవరు వదిలిన బాణం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అసలామె తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసిన సమయం నుంచే ఈ అనుమానాలు రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనం నుంచీ వ్యక్తమయ్యాయి.

 పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె ఆ రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది.   ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, తెలుగు రాష్ట్రాల రాజకీయ తెరమీద కనిపిస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు షర్మిల రాజకీయ ‘యాత్ర’పై విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే  వరంగల్ ఎపిసోడ్ కు ముందు వరకూ షర్మిల పాదయాత్రను కానీ, ఆమె హస్తిన వెళ్లి మరీ చేసిన ఫిర్యాదుల గురించి కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై రాళ్ల దాడి, కార్ వ్యాన్ దగ్ధం సంఘటనలు జరిగాయో అప్పటి నుంచీ ఆమె రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది.

ఏకంగా ప్రధాని మోడీ కూడా ఆమెపై దాడి, అరెస్టులపై స్పందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రగతి భవన్ కు వెళ్లే దారిలో షర్మిల కారులో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించిన సంఘటనతో ఆమె పొలిటికల్ మైలేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ తరువాత కూడా వరుస సంఘటనలు ఆమె మైలేజ్ పెంచేవిగానే సాగుతున్నాయి.  తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓ ఇరవై మందితో షర్మిల ధర్నాకు దిగారు.  ఆమె ధర్నాను పట్టించుకోకుండా వదిలేసి ఉంటే.. గత ధర్నాలు, నిరసనలలాగే కొద్ది సేపటి తరువాత ఆమే విరమించి వెళ్లిపోయే వారు. కానీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి  పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర విడిచి పెట్టారు. ఇంటి దగ్గర కూడా హై డ్రామా నడిచింది. షర్మిల ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే కూర్చుని నిరసన చేపట్టారు.

దీంతో పోలీసులు మళ్లీ రంగ ప్రవేశం చేసి బలవంతంగా ఇంట్లోకి పంపారు. నివాసంలో షర్మల  దీక్ష కొనసాగిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే నిరవధిక నిరశనకు దిగుతానని కూడా హెచ్చరించారు.   ఇదిలా ఉంటే.. ఇంత కాలం లేనిది ఇప్పుడు షర్మిల పాదయాత్రకు, నిరసనలకు ఎందుకీ ఆంక్షలు అన్న ప్రశ్నలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమని చెప్పక తప్పదు. ముందుగా ఏపీ విషయానికి వస్తే.. జగన్ మూడున్నరేళ్ల పాలనలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.   రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్యా చిచ్చు పెట్టైనా సరే పబ్బం గడుపుకుందామని చేసిన ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అయ్యాయి. మూడు ప్రాంతాలలోనూ వైకాపాకు చుక్కెదురే అయ్యింది. ఏ ప్రాంతంలోనూ వైసీపీని జనం ఆదరించడం లేదన్న సంగతి ప్రస్ఫుటమయ్యేలా వరుస సంఘటనలు జరిగాయి.

ఆఖరికి జగన్ సభలకు కూడా జనం రావడానికి విముఖత చూపుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారాన్ని కోరుతున్న పరిస్థితి. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించడానికి పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం అందించిన ‘సహాయ’ సహకారాలు తెలిసిందే. ఇప్పుడు మరో సారి జగన్ కేసీఆర్ సహకారం కోసం చూస్తున్నారు. అదే సమయంలో వరుసగా రెండు సార్లు కేసీఆర్ తెలంగాణలో తెరాసను అధికారంలోకి రావడానికి కారణాలెన్ని ఉన్నా ప్రధాన కారణం మాత్రం తెలంగాణ సెంటిమెంట్. 2014 ఎన్నికలలో తెలంగాణను సాధించిన నేతగా తనను తాను ప్రమోట్ చేసుకుని ఆ సెంటిమెంట్ తో అధికారంలోకి రాగలిగారు. ఇక 2019 ఎన్నికలలో మళ్లీ సమైక్య వాదుల కుట్ర అంటూ చంద్రబాబు కాంగ్రెస్ సహా పలు పార్టీల పొత్తుతో రాష్ట్రంలో ప్రచారం చేయడాన్ని బూచిగా చూపి సెంటిమెంట్ రగల్చగలిగారు. అయితే ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలనుకుంటున్న కేసీఆర్ కు ఈ సారి తెలంగాణ సెంటిమెంట్ ను తురఫు కార్డుగా ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది.  ఆయన స్వయంగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో ఆయన తెరాసను భారాసగా మార్చేశారు.  అలా ఆయన ఇక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని వదిలేశారు.

అయితే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను అధిగమించి మరో సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండాతో అయినా సరే.. అధికారంలోకి రావాలంటే..  సెంటిమెంటే శరణ్యం అన్న సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే తన వైపు నుంచి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే అవకాశం లేని పరిస్థితి ఉండటంతో అటువైపు నుంచి నరుక్కు వద్దామన్న వ్యూహ రచన చేశారు. అటు వైపు అంటే ఏపీ వైపు అన్న మాట. అక్కడ ఎలాగూ.. జగన్ సర్కార్  ఏం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చాలా ఉన్న యోచనలో ఉంది. దీంతో రోగీ వైద్యుడూ సామెతలా.. సమైక్య వాదాన్ని ఏపీలో తెరపైకి తీసుకు రావడం... అదే జరిగితే.. మళ్లీ వలస పాలనలోకి తెలంగాణ అంటూ ఇటూ  అంటే తెలంగాణలోనూ సెంటిమెంటును రగల్చవచ్చు.

ఈ వ్యూహంతోనే.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారంటున్నారు. అదే సమయంలో షర్మిల మైలేజీని పెంచితే.. తెలంగాణలో కూడా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందనీ, ఏపీ వ్యక్తి తెలంగాణలో రాజకీయాలేంటనే వాదన కూడా తెరమీదకు తేవచ్చన్నది ఇరు రాస్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.