‘రేడియో అక్కయ్య’ కన్నుమూత
posted on Oct 15, 2014 6:37PM

రేడియో అక్కయ్యగా తెలుగు ప్రజలకు చరిపరిచితురాలైన ప్రముఖ రచయిత్రి, రేడియో వ్యాఖ్యాత తురగా జానకీరాణి బుధవారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బాలానందం సంఘం తరఫున తురగా జానకీరాణి 30 సంవత్సరాలపాటు ఆకాశవాణిలో పనిచేశారు. ‘రేడియో అక్కయ్య’గా మంచి గుర్తింపు పొందారు. తురగా జానకీరాణి కన్నుమూత పట్ల పలువురు రచయితలు, కళాకారులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తురగా జనకీరాణి రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. వాటిని చిన్నారులతో ప్రదర్శింప చేశారు. ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి ఆమె. మంచి రచయిత్రిగా సంఘ సంస్కర్తగా కూడా ప్రశంసలు అందుకున్నారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక తురగా జానకీరాణి ఉన్నారు. ఎందరో బాలబాలికలకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయంపోయి ధైర్యంగా మాట్లాడటానికి వారిలోని సృజనాత్మకతకు బాలానందం ఒక వేదిక కావడానికి తురగా జానకీరాణి ప్రధాన కారకురాలు.