ముదిరి పాకానపడుతున్న ఇరు రాష్ట్రాల విభేదాలు

 

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తను నష్టపోవడమే కాకుండా ఇరు రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వాలకీ కూడా అనేక కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. దానికి తోడూ ఆంధ్రాపాలకులను, తెదేపా ప్రభుత్వాన్ని, దాని అధినేత చంద్రబాబు నాయుడుని తీవ్రంగా ద్వేషించే కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో నిత్యం ఏదో ఒక అంశం మీద రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, విమర్శలు ప్రతివిమర్శలు మామూలయిపోయాయి. చివరికి అవి గవర్నరు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతుండటం సర్వ సాధారణ విషయమయిపోయింది.

 

ఇప్పటికే నీళ్ళు, విద్యుత్ పంపకాల విషయంలో గొడవ పడుతున్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఇంటర్ మరియు ఎంసెట్ పరీక్షల నిర్వహణ మీద విభేదించాయి. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రస్తుత విద్యావిధానమే మరో పదేళ్ళు కొనసాగవలసి ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వేరేగా నిర్వహించుకొంటామని వాదిస్తోంది. దానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈసారి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తోంది.

 

తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ మరియు జలవివాదాలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే గవర్నరు మరియు కృష్ణానది జల యాజమాన్య బోర్దులకు పిర్యాదులు చేసి త్వరలోనే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్దపడుతుంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్, ఎంసెట్ అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతోంది. బహుశః ఇటువంటి పోరాటాలు మరో ఐదేళ్ళపాటు కొనసాగినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఇరు రాష్ట్రాల ప్రతిష్ట దెబ్బతింటుంది. అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.