రాజధాని అక్కడే...కానీ మిగిలిన జిల్లాల మాటేమిటి?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తరువాత ఎందుకో మౌనం వహించడంతో ఈ విషయమై పునరాలోచనలోపడిందేమో అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. అంతకు ముందు ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సానుకూలంగా ఉన్న ఇతర జిల్లాల నేతలు, ఈ జాప్యం చూసి ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు వారు కూడా భావించడంతో తమ జిల్లాలలోనే రాజధాని నిర్మించాలని డిమాండ్స్ చేయడం మొదలుపెట్టారు. జిల్లా పర్యటనలకు వచ్చిన రాజధాని ఎంపిక కమిటీ-శివరామ కృష్ణన్ కమిటీ ముందు అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు, యంపీలు, శాసన సభ్యులు సైతం తమ వాదనలు వినిపించడం, కమిటీకి వినతి పత్రాలు సమర్పించడం గమనిస్తే, ఈ విషయంలో జాప్యం జరిగితే రాజధాని విషయంలో కూడా జిల్లాల మధ్య వివాదం మొదలయ్యే ప్రమాదం ఉందని అర్ధమవుతోంది.

 

అన్ని జిల్లాల ప్రజలు, నేతలు తమ ప్రాంతంలోనే రాజధాని లేదా రెండవ రాజధాని ఏర్పాటుకావాలని కోరుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ, వారందరూ కూడా ఆ విధంగా అయినా తమ జిల్లా అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే రాజధాని కోసం పట్టుబడుతున్నారు తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. వారి ఆందోళనకు బలమయిన కారణాలే ఉన్నాయి. ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ పరిశ్రమలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటిస్తున్నాయి. అయితే వాటిలో అత్యధికం మళ్ళీ రాజధాని నిర్మితమవుతుందని భావిస్తున్న విజయవాడ-గుంటూరు సమీప ప్రాంతాలలో, వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియాలో వస్తున్నవార్తలు, మంత్రుల ప్రకటనలు మిగిలిన అన్ని జిల్లాల ప్రజలకు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. అందువలన ప్రభుత్వం ఒకవేళ రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించదలచినట్లయితే, మిగిలిన అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా వాటికి ఏమేమీ కేటాయించబోతోందో స్పష్టమయిన ప్రకటన చేసి హామీ ఇవ్వడం ద్వారా వారి ఆందోళన నివారించవచ్చును.

 

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని, అక్కడయితేనే రాష్ట్రంలో 13జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇదే విషయం ఈ నెల 22న డిల్లీలో శివరామ కృష్ణన్ కమిటీతో జరిగే సమావేశంలో తాను చెప్పబోతున్నట్లు తెలియజేసారు. అంటే రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉందని భావించవచ్చును.

 

దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన నిపుణుల బృందంతో కూడిన శివరామ కృష్ణన్ కమిటీ కూడా కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉంటేనే రాష్ట్రంలో 13జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఆ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువుగా ఉందని తనకు తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు స్వయంగా చెప్పారు.

 

అటువంటప్పుడు ఇంకా ఈ అంశంపై అయోమయం నెలకొని ఉండాల్సిన అవసరం లేదు. శివరామ కృష్ణన్ కమిటీతో సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశం, దానితోబాటే మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ఏమేమీ కేటాయించబోతోందో తెలియజేస్తూ ఒక స్పష్టమయిన ప్రకటన చేసి ఈ వివాదాలకు, అయోమయ పరిస్థితికి స్వస్తి పలికితే బాగుంటుంది. లేకుంటే తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణి అవలంభించినందున ఎటువంటి సమస్యలు తలెత్తాయో ఆవిధంగానే రాజధాని విషయంలో కూడా సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది.