తెలంగాణా క్యాబినెట్ నిర్ణయాలు



నిన్న సుమారు ఐదున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణా ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో 48 అంశాలపై చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అన్నిటినీ ఈ సమావేశంలో ఆమోదించారు.

 

ఈ సమావేశంలో హైలైట్స్:

 

రుణాల మాఫీ:

1. పంట, బంగారు, పవర్ లూమ్, వ్యవసాయం కోసం తీసుకొన్న ట్రాక్టర్లు, ట్రాలీల ట్రాన్స్ పోర్ట్ పన్నుబకాయిలు అన్నీ మాఫీ చేయబడ్డాయి. వాటిలో వ్యవసాయ మరియు బంగారు నగలపై తీసుకొన్న రుణాలు మొత్తం దాదాపు రూ.17-19000 కోట్లు. పవర్ లూమ్ రుణాలు రూ. 6.50కోట్లు, ట్రాక్టర్లు వగైరాల ట్రాన్స్ పోర్ట్ పన్ను బకాయిలు రూ. 76 కోట్లు.

 

సంక్షేమం పధకాలు:

1. వృద్ధులు, వితంతువులు, మరియు బీడీ కార్మికులకు నెలకు రూ 1000 పెన్షన్ మంజూరు.

2. వికలాంగులకు నెలకు రూ. 1500 పెన్షన్ మంజూరు. ఈ మూడు రకాల పెన్షన్లు వచ్చే దసరా-దీపావళి పండుగల మధ్య నుండి ఇవ్వబడతాయి. అందుకోసం అర్హులందరికీ పెన్షన్ కార్డులు, బ్యాంకు అకౌంటులు ఏర్పాటు చేయబడతాయి.

3. ఫీజు రీయింబర్స్ మెంటు స్థానంలో తెలంగాణా విద్యార్ధులకు ఆర్ధిక సహాయం. ఇది విద్యార్దుల అవసరాన్ని బట్టి పెంచబడుతుంది.

4. 1969 నుండి తెలంగాణా పోరాటంలో పాల్గొని అమరులయిన వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సహాయం, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయాలు. ఉద్యోగానికి అర్హులు కాని గ్రామస్తులకు 3ఎకరాల భూమి. వ్యవసాయానికి అవసరమయిన అన్ని సదుపాయాల కల్పనా, ఆర్ధిక సహాయం.

5. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద యస్సీ. ఎస్టీ, గిరిజన, ఆదివాసీల ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరపున రూ.50, 000 బహుమానం.

6. గిరిజనులు, ఆదివాసీలు, యస్సీ, ఎస్టీ ఒక్కో కుటుంబానికి 3ఎకరాల భూమి. 7. ముస్లిం ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు.

8. గల్ఫ్ వర్కర్స్ సంక్షేమం కోసం కేరళ తరహాలో ప్రత్యేక సంక్షేమ వ్యవస్థ ఏర్పాటు.

9. అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు తెలంగాణా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం. వారిలో వయసు మీరినవారి కోసం నిబంధనలు సడలింపు.

10. తెలంగాణా ప్రభుత్వోద్యోగులకు తెలంగాణా స్పెషల్ ఇంక్రిమెంటు

11. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీ వేయబడుతుంది. దాని నివేదిక ఆధారంగా జీతభత్యాలు పెంచబడతాయి.

 

కొత్త కమిటీలు, కమీషన్ల ఏర్పాటు:

1. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్.

2. తెలంగాణా పర్యాటక కార్పోరేషన్.

3. తెలంగాణా కాలుష్య నివారణ సంస్థ.

4. తెలంగాణా ఎన్నికల కమీషన్.

5. తెలంగాణా వ్యవసాయ విద్యాలయానికి స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు.

6. తెలంగాణా పశు విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహ రావు పేరు ఖరారు.

7. జ్యూడిషియల్ అధికారాలతో కూడిన వక్ఫ్ బోర్డు ఏర్పాటు.

8. యస్సీ కమీషన్ ఏర్పాటు.

9. మేధావులు, జర్నలిస్టులు తదితరులతో కూడిన ప్రజా సలహా సంఘం ఏర్పాటు (రాష్ట్ర సలహా సంఘం). ఇది ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రయోగం విజయవంతం అయినట్లయితే జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి ప్రజా సలహా సంఘాలు ఏర్పాటు చేయబడతాయి.

 

పోలీసు విభాగం:

1. హైదరాబాదులో పోలీసు భద్రత పెంచేందుకు అవసరమయిన కార్లు, మోటార్ సైకిళ్ళు కొనుగోలుకు రూ 343 కోట్లు మంజూరు.

2. ఈ కొత్త వాహనాలు నడిపేందుకు 3620 డ్రైవర్లు, పోలీసు కానిస్టేబుళ్ల నియామకం

3. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన డీ.యస్పీ.ల గౌరవం కాపాడేందుకు సూఒపార్ న్యూమరరీ పోస్టులు కల్పించి వారందరికీ అదే స్థాయిలో ఉద్యోగభద్రత, హోదా కల్పించేందుకు ఆమోదం.

4. హైదరాబాదు జంట నగరాలలో అడుగడుగునా సీసీ కెమెరాల్ ఏర్పాటు.

5. జంట నగరాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు విదేశీ కన్సల్టెంట్ తో ఒప్పందానికి అనుమతి మంజూరు.

6. గతంలో జంట నగరాలలో బలవంతంగా మూయించి వేసిన కళ్ళు దుఖాణాలను మళ్ళీ తెరిపించేందుకు చర్యలు.

 

ఇతర నిర్ణయాలు:

1. కోయ, చెంచు మొదలయిన గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలు 500కి మించి జనాబా ఉన్నవాటిని గ్రామ పంచాయితీలుగా మార్పు.

2. వారికి ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి.

3. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణా రాజముద్రలో చిన్న మార్పులు.

4. బ్రతుకమ్మ, బోనాలు పండుగలు ఇకపై రాష్ట్ర పండుగలు.

5. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్.యంపీ. పీ.యంపీలకు అవసరమయిన వైద్య శిక్షణ ఇచ్చి, వారు నిర్భయంగా వైద్య సేవలు అందించేందుకు గాను సర్టిఫికెట్లు కూడా ఇవ్వబడతాయి.

6. పరిశ్రమలకు అవసరమయిన అన్ని అనుమతుల మంజూరు కొరకు సింగిల్ విండో పద్ధతి అమలు.