ఏపీ రైల్వేజోన్‌పై త్వరలో నిర్ణయం

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. ఈ విషయం మీద అధ్యయనం జరుపుతున్న కమిటీ కాల పరిమితిని అక్టోబర్ 15 వరకు పెంచామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని ఆయన తేల్చిచెప్పారు. సదానంద గౌడ శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 21,022 కోట్ల రూపాయల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు 2106 కోట్ల రూపాయల నిధులను కేటాయించామన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 35 ప్రాజెక్టులు వివిద దశల్లో ఉన్నాయన్నారు. 4,325 కి.మీ పొడవు రైల్వే మార్గం పనులకు 20 వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. 958 కి.మీ పొడువు రైల్వే లైన్ల పనులు పూర్తయ్యాయన్నారు. 29 కొత్త మార్గాల్లో సర్వే పనులు చేపట్టగా, 20 మార్గాల్లో సర్వే వివిధ దశల్లో ఉందన్నారు. ఈ ఏడాది మిగిలిన 9 మార్గాల్లో సర్వే పూర్తవుతుందన్నారు.