ఆంధ్రప్రదేశ్ కొత్త ఐటీ విధానం త్వరలో!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించనుంది. పదిహేను రోజుల్లో ఈ విధానాన్ని ప్రకటించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విశాఖ జిల్లా మధురవాడలోని ఐటీ సెజ్‌ను ఆయన మంగళవారం నాడు సందర్శించారు. ఐటీ రంగంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, దీనివల్ల ఐటీ రంగ నిపుణులకు ఎంతో మేలు జరిగే అవకాశం వుందని అయన చెప్పారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే ఐటీ సెజ్ల్లో భూములను తీసుకుని వాటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు.