ఏప్రిల్ 1నుండి వాహనాలపై ప్రవేశపన్ను?
posted on Mar 16, 2015 8:25AM
.jpg)
ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల నడుమ తిరిగే వాహనాల మీద రోడ్డు టాక్స్ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. తెలంగాణా ప్రభుత్వం క్రిందటేడాది జూన్ లో ఆంధ్రా రిజిస్ట్రేషన్ తో ఉండి తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న వాహనాలపై పన్ను విధించినప్పుడు హైకోర్టు కలుగజేసుకొని 2015 మార్చి 31వరకు ఇరు రాష్ట్రాలు కూడా వాహనాలపై ఎటువంటి కొత్త పన్నులు విధించరాదని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగియనుంది కనుక తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలంగాణాలోకి ప్రవేశిస్తున్నఆంధ్రా రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎంట్రీ టాక్స్ విధించబోతున్నట్లు వాహన యజమానులకు నోటీసులు అందజేయడం మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఆంద్రప్రదేశ్ రవాణా శాఖ కూడా తెలంగాణా వాహనాలపై ప్రవేశ పన్ను విధించే అవకాశం ఉంది.
దీనివలన నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే సరుకు రవాణా మరియు ప్రైవేట్ ట్రావల్స్ సంస్థల వాహనాలు భారీగా పన్నులు చెల్లించవలసి ఉంటుంది. ఈవిధంగా ఇరు రాష్ట్రాలు తమపై వేర్వేరుగా పన్నులు విధించేబదులు తాము చెల్లించే పన్నులో ఇరు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకొనేట్లు ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతూ వాహన యజమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక వినతి పత్రం సమర్పించారు. కానీ విద్యుత్, నీళ్ళు, ఆదాయం, అప్పులు, ఆస్తులు వగైరాలు ఆవిధంగా పంచుకోవడంలో విఫలమయిన ఇరు ప్రభుత్వాలు ప్రైవేట్ వాహన యజమానులు చేస్తున్న ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాయని ఆశించలేము. అంగీకరిస్తే ఇదొక శాశ్విత సమస్యగా మారుతుంది.