రాజకీయ నేతల మాటల ప్రభావం వల్లనే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయా?

 

ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో రాష్ట్రంలో నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకొంటున్నారు. కానీ వారు ప్రత్యేక హోదా గురించి కొందరు రాజకీయ నాయకులు చెపుతున్న మాటల ప్రభావానికి లోనయినందునే ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన తరువాతనే పైకి వచ్చింది. అప్పుడూ దాని గురించి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలు పెట్టి ‘ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు...మీ పిల్లలకు ఉద్యోగాలు రావు...వారి భవిష్యత్ అంధకారం అయిపోతుంది’ అని పదేపదే నొక్కి చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండే రాష్ట్రంలో ఆత్మహత్యలు మొదలయ్యాయి. పేద, దిగువ మధ్య తరగతికి చెందినవారి ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కనుక వారు నిత్యం కష్టాలు, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి వారిపై ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు పెను ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నేతలు ప్రజలకు వారి భవిష్యత్ పట్ల ఆశ, భరోసా కల్పించకపోగా తమ మాటలతో వారిని తీవ్ర ప్రభావితం చేసి వారు ప్రాణాలు తీసుకొనేందుకు ప్రోత్సహిస్తున్నట్లుంది. వారు తమ మాటలతో సమాజాన్ని ముఖ్యంగా నిరుపేదలని ‘మాస్ హిప్నటైజ్’ చేస్తున్నారని చెప్పవచ్చును. ప్రజలకు సరయిన మార్గ దర్శనం చేయగలిగినవాడే నాయకుడు తప్ప ప్రజలని మృత్యు మార్గం పట్టించేవాడు కాదు.

 

ప్రజలు కూడా ఇప్పుడు పార్టీల వారిగా చీలిపోతున్నారు. కనుక వారిపై సదరు పార్టీ నేతలు మాటల ప్రభావం సహజంగానే మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకే చెందిన మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమే. కానీ అది రానంత మాత్రాన్న ప్రళయం రాదనే సంగతి ప్రజలు కూడా తెలుసు. అటువంటప్పుడు రాజకీయ నేతలు తమ పార్టీల ఉనికిని కాపాడుకోవడానికో లేక తమ పార్టీలో నేతలు, కార్యకర్తలు వేరే పార్టీల వైపు చూడకుండా పట్టి ఉంచుకోనేందుకో లేకపోతే ప్రజలకు, అధికార పార్టీకి తమ శక్తి ప్రదర్శించడానికో చేస్తున్న పోరాటాలు, మాట్లాడుతున్న మాటలను నమ్మి ఆత్మహత్యలు చేసుకోవడం అవివేకం. దాని వలన వారి కుటుంబాలే రోడ్డున పడుతాయి. కానీ వారి ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తూ పార్టీలు మరింత బలపడే ప్రయత్నాలు చేస్తుండటం మన కళ్ళ ముందే జరుగుతోంది. కనుక ప్రజలు భావోద్వేగాలకు లొంగి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం వలన సాధించేదేమీ ఉండదని గ్రహించాలి.

 

రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడూ ఆంధ్రా ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు రాలేదు. అన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. కానీ అప్పుడు ఎవరూ ఈవిధంగా వరుసపెట్టి ఆత్మహత్యలు చేసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేని మాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి వలన ఇప్పటికే చిత్తూరు, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాలలో చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ సిటీ, కృష్ణపట్నం వద్ద అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీలు, ప్రోత్సాహకాల వలన అక్కడ చాలా పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. నిజం చెప్పాలంటే రాష్ట్ర విభజన తరువాతే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకొంది. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు అయితే అది మరింత వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది. అంతే!

 

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొత్తగా ఎన్ని, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి? వాటి వలన ఎంత మందికి ఉపాధి దొరకబోతోంది? ఇంకా మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టబోతోంది? దాని వలన ప్రజలకు, ముఖ్యంగా యువతకు, నిరుపేదలకు ఏవిధంగా ప్రయోజనం కలుగబోతోంది? అనే విషయాల గురించి ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేయడం ద్వారా ఈ ఆత్మహత్యలను నివారించవచ్చును.

 

ఈ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా చేసుకొంటున్నప్పుడు, ప్రభుత్వం కూడా దానిని ఒక రాజకీయ, సామాజిక సమస్యగా పరిగణించి అంతే ధీటుగా ఎదుర్కొనవలసి ఉంది. లేకుంటే ప్రత్యేక హోదా వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో తెలియని రమణయ్య వంటి అమాయకులు ప్రాణాలు తీసుకొంటూనే ఉంటారు. వారు ఆత్మహత్యలు చేసుకొంటున్నకొద్దీ ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.