చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు ... భారీ వర్షమే కారణం

ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్​ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది.
విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో పట్టపగలే చిమ్మ చీకట్లు వచ్చాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో ఎక్కడి జనం అక్కడే నిలుచిపోయారు. ఉదయం నుంచి వాతావరణం మామూలుగా ఉండి అకస్మత్తుగా పెద్ద ఎత్తున వాన కురిసింది దీంతో జనాలు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
 గన్నవరంలోనూ జోరుగా వర్షం కురుస్తున్నా చంద్రబాబు సభలో ప్రజలు అలాగే ఉన్నారు. వాన పడుతున్నా బాబు ప్రసంగించారు. ప్రచారంలో భాగంగా తరువాత తెలుగుదేశం అధినేత మాచర్ల వెళ్లాల్సి ఉంది. ఓ వైపు వాన జోరందుకుంది. వాతావరణం బాగాలేకున్నా మాచర్ల వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు మాచర్ల పర్యటన ఆగింపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల మాచర్ల రూట్ క్లిష్టంగా ఉందని, అటవీప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్లు తెలిపారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్ డైవర్షన్ తీసుకుంటేనే సాధ్యమని పైలట్లు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో ఒంగోలు బయలుదేరిన చంద్రబాబు పరిస్థితిని మాచర్ల ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అవకాశాలన్నీ పరిశీలించినా సాధ్యపడలేదు, కనుకే మాచర్ల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెపిపారు. బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, పల్నాడు ప్రజలు తమ ఓటుతో రౌడీ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలని అన్నారు.