ఒక వివాదం నుండి మరో వివాదానికి నిరంతర ప్రయాణం

 

తెలంగాణాలో గుడుంబాని అరికట్టేందుకే చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నామని చెప్పుకొన్న తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ఆలోచనని విరమించుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలిపారు. ఎప్పుడూ ఎవరివో మెడలు వంచుతానని చెప్పుకొనే కేసీఆర్ మెడని తామే వంచామని ప్రతిపక్షాలు చెప్పుకొంటున్నాయి. ఒకవిధంగా అది నిజం కూడా. సచివాలయ నిర్మాణం కోసం ఎర్రగడ్డలో ఉన్న ఆసుపత్రులను, వాటితో బాటే పక్కనే ఉన్న చారిత్రాత్మక కట్టడాన్ని కూల్చివేయాలనుకోవడం, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల్లో పేదలకు ఇళ్ళు కట్టించాలనుకోవడం, ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయాలనుకోవడం, తెలంగాణా వ్యాప్తంగా కల్లు, చీప్ లిక్కర్, మైక్రో బ్రూవరీ (బీర్ వెండింగ్ మెషిన్లు) లను ఏర్పాటు చేయాలనుకోవడం ఇలాగ చెప్పుకొంటూ పోతే ఆ లిస్టు చాంతాడంతవుతుంది. ఆ నిర్నయాలన్నిటినీ వెనక్కు తీసుకొనేలా చేసింది ప్రతిపక్షాలే.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ఏదో ఒకటి ఆర్భాటంగా ప్రకటించడం, దానిని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం తరువాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. అనేక కేసుల విషయంలో కూడా తెలంగాణా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన తరచూ కోర్టుల చేత అక్షింతలు వేయించుకోవలసి వస్తోంది. ఇదంతా తెలంగాణా ప్రభుత్వానికి గౌరవప్రదం కాదనే సంగతి గ్రహిస్తే మంచిది. చీప్ లిక్కర్ పై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరో వివాదస్పద నిర్ణయం ప్రకటించారు.

 

జి.హెచ్.యం.సి. పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల వలన కలిగే నష్టాన్ని జి.హెచ్.యం.సి.యే భరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే అది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లేనని చెప్పవచ్చును. నిధుల కొరత వలన జి.హెచ్.యం.సి. పరిధిలో రోడ్లు, మురికి కాలువలు, మంచి నీళ్ళు, వీధి దీపాలు వగైరా సరిగ్గా నిర్వహించలేకపోతున్నట్లు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అటువంటప్పుడు ఎప్పుడూ నష్టాలలోనే కొనసాగే ఆర్టీసీ భారాన్ని కూడా జి.హెచ్.యం.సి.మీద మోపడం ఏవిధంగా సమర్ధించుకొంటుంది? అసలు తెలంగాణా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆర్టీసీ భారాన్ని జి.హెచ్.యం.సి. నెత్తిన ఎందుకు రుద్దాలనుకొంటోంది? అనే సందేహం కూడా కలగక మానదు. జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాస విజయావకాశాలపై బహుశః నమ్మకం లేనందునే ప్రతిపక్షాల చేతిలోకి వెళ్లబోయే జి.హెచ్.యం.సి.పై ఆ భారం మోపాలనుకొంటోందా? అనే అనుమానం కలగడం సహజం. కనుక నేడో రేపో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ పోరాటాలు ఆరంభించినా ఆశ్చర్యం లేదు.

 

ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకొని నష్టాల నుండి బయటపడేయాలని కోరుతుంటే, ప్రభుత్వం వారిని జి.హెచ్.యం.సి.కి అప్పగిస్తే వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ జి.హెచ్.యం.సి. ఆ భారం మోయలేకపోతే అప్పుడు దానిని ఎవరు భరిస్తారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలే కాదు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, జి.హెచ్.యం.సి. కూడా వ్యతిరేకించినా ఆశ్చర్యం లేదు. మళ్ళీ అప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తీసుకొంటుందేమో? అందుకేనేమో అడుసు త్రొక్కనేల...కాలు కడుగనేల? అని పెద్దలు అన్నారు.