ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకే హ్యాండిస్తారేమో?

 

బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు పార్టీలు కలిసి జనత పరివార్ పేరుతో చేతులు కలిపాయి. వాటికి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ని అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. ఆయన పాత్ర అంతవరకే పరిమితమన్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా తలో వంద సీట్లు పంచేసుకొని, మిగిలిన 43 సీట్లలో 40 కాంగ్రెస్ పార్టీకి మిగిలిన3 సీట్లు ములాయంకి వదిలేశారు.

 

అధ్యక్షుడయిన తనకు తెలియజేయకుండా, తన పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించకుండా నితీష్, లాలూ, కాంగ్రెస్ ముగ్గురూ కలిసి తనను మోసం చేసారని ములాయం సింగ్ తీవ్ర ఆగ్రహం చెందారు. జనతా పరివార్ కాడిని వదిలేస్తున్నట్లు ప్రకటించేశారు. అంతేకాదు ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా ప్రకటించేసరికి నితీష్, లాలూ ఇద్దరూ కంగుతిన్నారు. వెంటనే ఇద్దరూ హడావుడిగా డిల్లీ వెళ్లి ములాయం ముందు వాలిపోయారు. జనత పరివార్ విడిపోతే అందరం నష్టపోతామని, బీజేపీ అధికారం ఎగరేసుకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన వాటా సీట్లు తనకు పంచి ఇస్తే గానీ తిరిగి రానని ములాయం కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తాజా సమాచారం.

 

ములాయం సింగుకి కూడా సీట్లలో వాటా పంచి ఇవ్వాలంటే నితీష్, లాలూ తమ సీట్లలో కొన్నిటిని వదులుకోవలసి ఉంటుంది. అలాగ చేస్తే అప్పుడు జనతా పరివార్ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినా వారికి ప్రభుత్వంపై పూర్తి పట్టు దొరకదు. అప్పుడు ఎవరో ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. నితీష్ కుమార్ జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరును ప్రకటింపజేసుకొన్నందున అందుకు అంగీకరించకపోవచ్చును. కనుక లాలూ తన సీట్లలో కొన్నిటిని త్యాగం చేయవలసి ఉంటుంది. కానీ అలాగ చేస్తే ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి వీలుపడదు. కనుక లాలూ కూడా తన సీట్లను త్యాగం చేసేందుకు ఇష్టపడకపోవచ్చును.

 

అప్పుడు ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. అదేమీ జనత పరివార్ లో భాగస్వామి కాదు. ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేకనే జనతా పరివార్ ని పట్టుకొని వ్రేలాడుతోంది. కనుక దానికిచ్చిన 40సీట్లను లాక్కొని దానిని బయటకి గెంటేసినా దాని వలన పెద్దగా నష్టం ఉండదు. కనుక ముగ్గురూ కలిసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఓ ఐదో పదో సీట్లతో అది సర్దుకుపోయేందుకు ఇష్టపడితే దానినీ తమతో ఉంచుకోవచ్చును. లేకుంటే ముగ్గురూ కలిసి నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ ని బయటకి గెంటేయవచ్చును. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. కనుక కాంగ్రెస్ వారితో సర్దుకుపోయేందుకే రెడీ అవవచ్చును.

 

ఒకవేళ వారి మధ్య సీట్ల సర్దుబాటు కాకపోతే మాత్రం బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ముక్కలు చెక్కలయిన జనతా పరివార్ తో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఎన్నికలలో కబాడీ ఆడేసుకొంటారు.