వీళ్ళని చూస్తే బాధ.. వాళ్ళని చూస్తే ఆనందం!!

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మన భారతదేశ పౌరులు విభిన్నగంగా వుంటారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంతమంది పద్ధతి చాలా బాధని కలిగిస్తూ వుంటుంది. అదే సమయంలో ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొంతమంది కమిట్‌మెంట్ ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక మైనస్ బాధిస్తే, మరో ప్లస్ దాన్ని బేలన్స్ చేస్తూ వుంటుంది. ఈ రెండు భిన్నత్వాలు కలిసి వుంది కాబట్టే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వున్న దేశంగా అయింది.

చాలామంది ఓటర్లు ఓటు వేయాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎన్నెన్నో తాయిలాలు ఆశ చూపించాలి. స్వర్గాన్ని కిందకి దించుతామని హామీలు ఇవ్వాలి.. అప్పుడుగానీ కొంతమంది ఓటు వేయడానికి ఇళ్ళలోంచి బయటకి కదలరు. ఇంత చేసినా ‘మనం ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే’ అని ఊరుకునేవాళ్ళూ వుంటారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమేనా అనే సందేహం వచ్చేలా చేస్తారు. ఇలాంటివారు నిరాశ కలిగిస్తే, మరికొంతమంది ఉత్సాహం కలిగిస్తారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు తరలి వస్తారు. ఆ దూర ప్రాంతాలు విదేశాలు అయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అనేకమంది విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అలా వస్తున్న భరతమాత ముద్దుబిడ్దలతో విజయవాడ విమానాశ్రయి క్రిక్కిరిసిపోతోంది. విమానాశ్రయానికి వెళ్ళే రోడ్లు వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి ఓటర్లను చూసినప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని అనిపిస్తూ వుంటుంది. ఓటు వేయడం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి వస్తున్నారని, ఇంకో మూడు రోజులపాటు విజయవాడ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే వుంటాయని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.