అండమాన్ ఆదిమవాసులను వదలని కరోనా..
posted on Aug 28, 2020 10:02AM
ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మన దేశంలోను విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా పల్లెటూళ్లను, నగరాలను కూడా చుట్టబెడుతోంది. అయితే తాజాగా ఈ వైరస్ సుదూర అటవీ ప్రాంతం లోనూ విస్తరిస్తోంది. సామాన్య మానవులకు అందనంత దూరంలో ఉండే ఆదిమ జాతి తెగలోనూ కరోనా తన పంజా విసురుతోంది. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదిమ మానవులకు కరోనా సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి గ్రేటర్ అండమానిస్ తెగలోని 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ కరోనా బాధితులంతా స్ట్రెయిట్ దీవి వాసులే. ఈ తెగలోని కొందరు రాజధాని పోర్ట్ బ్లెయిర్ వెళ్లడంతో అక్కడి అధికారులు వారికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఆరుగురికి పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారు నివాసం ఉంటున్న స్ట్రెయిట్ దీవికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. అయితే మొత్తం కలిపి 50 మంది జనాభా ఉన్న ఆ దీవిలో ఏకంగా పది మందికి కరోనా సోకడంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.