న్యూస్ ఎక్స్ సర్వే సైతం అదే చెప్పింది.. చంద్రబాబే సీఎం!

ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది. వైసీపీ భారీగా నష్టపోతున్నదని తేల్చేసింది.  రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వంద్వంగా పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 18 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది.

రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేస్తున్నది.  కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి.  ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న 17 లోక్ సభ స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాలలో రెండింటిలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ గెలపు తథ్యం.  అంటే తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలలో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి. 

దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రతిఫలించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 126 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ 49 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చింది. 

తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాలలో, జనసేన 21, బీజేపీ పది స్థానాలలో అభ్యర్థులను నిలుపుతోంది. లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం 98 స్థానాలలో విజయం సాధిస్తుంది.  అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలున్నాయనీ, ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.