అమ్మ ఒడి పథకంలో షరతులు... ప్రణాలికను విడుదల చేసిన జగన్ ప్రభుత్వం

 

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. 75% హాజరు ఉంటేనే పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల, పన్ను చెల్లించే వారి పిల్లలకు అమ్మ ఒడి లేదు. ఏపీ సర్కార్ వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెలాఖరు నాటికి విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని తెలిపింది.ఒకవేళ అంత కంటే తక్కువ హాజరువుంటే ప్రధానోపాధ్యాయులు నిశిత పరిశీలన చేసి హజరు తగ్గటానికి విద్యార్థి లోపం లేదని పరిగణనలోకి తీసుకోవచ్చని సిఫార్సు చేస్తే పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. 

అదే విధంగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్న మాజీ ఉద్యోగుల పిల్లలకు అమ్మ ఒడి ఉండదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వ.. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపు దారుల పిల్లలు ఈ పథకం కింద అర్హులు కాదని తెలిపింది. దారిద్య రేఖకు దిగువ ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కలిగిన వారు అమ్మఒడికి పూర్తి అర్హులని ప్రభుత్వం వివరించింది. ఈ కార్యక్రమం కోసం డీఈవో కార్యాలయంలో 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు. 

అమ్మఒడి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 13జిల్లాలకు పర్యవేక్షకులను నియమించారు. పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా నిర్థారించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపాలి. ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి. వీటి పై అభ్యంతరాలను మూడు రోజుల్లో సేకరించి తెలియజేయాలి. ఆధార్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1వ తేదీలోగా సేకరించి హెచ్ ఎం అందించాలి. ముసాయిదా జాబితాకు డిసెంబరు 15 నుంచి 18వ తేదీలోగా గ్రామ సభ ఆమోదం పొందాలి. ఈ జాబితాను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా పీవోకు డిసెంబర్ 23 లోగా అందించాలి. బిఈవో డిసెంబర్ 24 నాటికి కలెక్టర్ ఆమోదం కోసం సమర్పించాలని ప్రభుత్వం ప్రణాళిక విడుదల చేసింది.