ఇరాన్ సెల్ఫ్‌గోల్ .. రంగంలోకి అమెరికా!

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో  పశ్చిమాసియా రగిలిపోతోంది.  అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు  ఉద్రిక్తతలను మరింత పెంచాయి.  ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.  మరోవైపు  ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది.  పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇజ్రాయెల్‌,  ఇరాన్‌ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తమతో న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు ఒప్పందం కుదుర్చుకోవడం లేదన్న గుర్రుతో అమెరికా కూడా ఇరాన్‌పై కత్తులు నూరుతోంది. అదును చూసి దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో  ఇరాన్‌ రాజకీయ నాయకత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.  ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లూ ఇరాన్‌ కు పాలు పొసి పెంచిన హమాస్‌, హెజ్‌బొల్లా, హూతీలు లాంటి ముసుగు సంస్థల జాడ కనిపించడం లేదు. 

పశ్చిమాసియాలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్‌.. అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. పాలస్తీనాలో హమాస్‌, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లో కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటికి సహకారం అందించింది. నేరుగా తాను యుద్ధ రంగంలోకి దిగకుండా.. శత్రుదేశాలపై వీరిని ఉసిగొల్పేది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ , హమాస్‌ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్‌బొల్లా ముందుకురావడంతో ఆ యుద్ధం బీరుట్‌ వరకు ఎగబాకింది. ఇజ్రాయెల్‌ ప్రతాపానికి హమాస్‌, హెజ్‌బొల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వారిని ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన ఇరాన్‌లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరించడంతో.. ఇరాన్‌ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి, సెల్ఫ్‌గోల్ చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అదలా ఉంటే ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్ర దేశాలను కూడా కదిలిస్తోంది. టెహ్రాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి.. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మీడియాకు వెల్లడించారు.

మరోవైపు ఇరాన్‌లోని బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిపైనా రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి స్పందించారు. పొరపాటు వల్లే దాడి జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, బుషెహర్‌కు ప్రమాదం వాటిల్లిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu