రైతుల సవాల్.. కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్!
posted on Feb 3, 2020 1:25PM

హైకోర్టును కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ వేశారు. జీవో నెంబర్ 13 చట్ట విరుద్ధమంటూ పిటిషన్ లో పేర్కొన్నారు రైతులు. ఈ ఉదయం హైకోర్టుకు రాజధాని ప్రాంత రైతులు, రైతు పరిరక్షణ సమితి తరఫున పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా దాఖలు చేశారు. శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు.
తాజాగా కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి తరలించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోర్టు మెట్లెక్కారు రాజధాని రైతులు. కార్యాలయాలను కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటీషన్ లో జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చి పిటిషనర్ పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది.