అమరావతి వేదికగా కేసీఆర్ కొత్త అధ్యాయం

 

సుమారు పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు, విజయదశమి రోజున అంటే గురువారం విజయవంతంగా అమరావతిలో కాలు మోపనున్నారు, రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడైన కేసీఆర్... ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తుండటం, ఆశీస్సులు అందించబోతుండటం చాలా ప్రత్యేకమైనదిగానే చెప్పుకోవాలి. పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్.... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకానుండటం విశేషంగానే చెప్పుకోవాలి.

తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉండగా రెండుసార్లు ఏపీకి వచ్చే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో అది మిస్సైంది, రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ఆంధ్రా ప్రజలకు వివరించేందుకు 2010లో ఒకసారి విజయవాడ వచ్చేందుకు సిద్ధమైనా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. అలాగే లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్ కూడా ఏపీలో పర్యటించాలని కేసీఆర్ ను ఆహ్వానించినా అది కూడా సాధ్యపడలేదు, చివరికి రాష్ట్ర విభజన జరిగాక... ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఆశీస్సులు అందించడానికి రాబోతుండటం చిత్రమే మరి.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హాజరుకాబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... మరో రెండు నెలల గ్యాప్ లో మరోసారి ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల శ్రీవారికి, బెజవాడ కనకదుర్గకు పలు మొక్కులు మొక్కుకున్న కేసీఆర్... వాటిని తీర్చుకునేందుకు ఆయన ముఖ్యమంత్రి కాగానే నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు, అయితే అమరావతి రూపంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో వాతావరణం మారిపోయింది, ఇద్దరు చంద్రుల మధ్య కొత్త స్నేహం చిగురించడంతో పనిలో పనిగా తన మొక్కులను కూడా తీర్చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట, సరిగ్గా మరో రెండు నెలల్లోనే తిరుమల శ్రీవారిని, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కానుకలు సమర్పించుకోనున్నట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu