గుహ నుంచి వచ్చిన సింహం ప్రపంచాన్ని వణికిస్తుందా..?

అల్‌ఖైదా..ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను విమానాలతో కూల్చివేసిన ఘటన కళ్లముందు మెదులుతుంది. అనేకదేశాల్లో రక్తపుటేరులను పారించిన ఈ ఉగ్రసంస్థ.. అధినేత ఒసామా బిన్‌లాడెన్ మరణంతో చడిచప్పుడు లేకుండా పోయింది. అలాంటి సంస్థకు వారసుడొచ్చినట్లు ప్రపంచ నిఘా సంస్థలు ధ్రువీకరిస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ అల్‌ఖైదా పగ్గాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అతని వయసు 28 సంవత్సరాలు. ఒసామాకి ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. అమెరికా అల్‌ఖైదా స్థావరాలపై దాడులు చేస్తుండటంతో లాడెన్ తన భార్యపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపాడు. ఆ లాడెనే లేడు హమ్జాకు అంత సీనుందా అని అనుకోవచ్చు. అయితే ఒసామా బిన్ లాడెన్ మహ్మాద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. అతని వారసుడు హమ్జా పిలుపునిస్తే వేలాది ముస్లిం యువత అల్‌ఖైదాలో చేరి ప్రపంచానికి తీరని నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే హమ్జా ఎలా ఉంటాడు అనేది ఎవ్వరికి తెలియదు..కేవలం అతని చిన్ననాటి ఫోటో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతనిని అల్‌ఖైదా నేతలు గుహ నుంచి వచ్చిన సింహంగా అభివర్ణించారు.