టికాయత్ అసలు లక్ష్యం చట్టాల రద్దు కాదా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తోలి రోజునే, కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నూతన సాగు చట్టాల రద్దు శ్రీకారం చుట్టింది. విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వం నూతన సాగు చట్టాల రద్దు బిల్లు-2021 ను  లోక్సభలో ప్రవేశ పెట్టింది. బిల్లుకు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం ముందుగానే, బీజేపే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. సంవత్సర కాలం పైగా ససేమిరా అన్న చివరకు, రైతుల ఆందోళనలకు తలొగ్గి, ఇచ్చిన మాట ప్రకారం సాగు చట్టాల రద్దు ప్రక్రియలో ముందడుగు వేసింది. 

అయితే, ఇంతకాలంగా, మూడు వివాదస్పద సాగు చట్టాల రద్దును మాత్రమే డిమాండ్ చేస్తూ వచ్చిన, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కొత్త మెలిక డిమాండ్లను  తెరమీదకు తెచ్చారు.లోక్ సభలో బిల్లు మోదం పొందిన నేపధ్యంలోనూ రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సాగిన తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని స్పష్టం చేశారు.ఆలాగే, నిన్న (ఆదివారం) ముంబైలో  ఆయన,గత సంవత్సరం  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు మరో సారి పునరావృతం అవుతాయంటూ చేసిన హేచరికలు, దేశంలో అలజడి,అశాంతి, సృష్టించడమే టికాయత్ అసలు లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

 పార్లమెంట్ లోపల ప్రతిపక్షాల ధోరణి కూడా అదే విధంగా ఉందని, చట్టాల రద్దు కంటే ఆందోళన కొనసాగించడం పైనే, ప్రతిపక్షాలు దృష్టి పెట్టాయనిపించేలా వారి ప్రవర్తన ఉందని  పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే సభ లోపలా, వెలుపల కూడా విపక్షాలు  గందరగోళ పరిస్థితులు సృష్టించాయని అంటున్నారు. ముఖ్యంగా, లోక్ సభలో రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టి, సాగు చట్టాల రద్దు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే లోక్ సభలో సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది.

కేంద్రం గతేడాది తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగణంగా నేడు 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'ని కేంద్రం ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.