అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

 

గుండెల్లో మంట,   కడుపులో మంట వంటి లక్షణాలు చాలా మంది ఎదుర్కుంటూ ఉంటారు.  ఇదే అసిడిటీ.. ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది సింపుల్ గా మెడికల్ స్టోర్ లో టాబ్లెట్లు లేదా సిరప్ వంటివి తెచ్చి వాడుతూ ఉంటారు. ఇవి వాడినప్పుడు ఉపశమనం కూడా ఉంటుంది.  కానీ అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల చాలా ప్రమాదకరమన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు అంటున్నారు.  అవేంటో.. అసలు అసిడిటీ ఎందుకు వస్తుందో.. దీనికి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుంటే..

అసిడిటీ సమస్య వచ్చినప్పుడు చాలా మంది మెడికల్ స్టోర్ లో మందులు తెచ్చుకుని వాడుతూ ఉంటారు. వీటిలో ఒమెప్రజోల్ అనేది చాలా ముఖ్యమైనది.  ఈ ఔషధం భారతదేశంలో వివిధ పేర్లతో పిలవబడుతుంది. ఇది అనేక బ్రాండ్లను కూడా కలిగి ఉంది.

అసిడిటీ సమస్య ఉపశమనం కు వాడే మందులు కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తాయట.  ఇది మంచి బ్యాక్టీరియాను కోల్పోవడానికి,  సి.డిఫిసిల్ వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దారి తీస్తుందట. దీని వల్ల కలిగే ఇన్పెక్షన్ ప్రేగులను ప్రభావితం చేస్తుంది.  దీని వల్ల విరేచనాలు,  కడుపునొప్పి, జ్వరం,  శరీరం డీహైడ్రేట్ కు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు..  విటమిన్-బి12 లోపం,  ఎముకలు బలహీనపడటం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర ప్రమాదాలు కూడా వస్తాయని అంటున్నారు వైద్యులు.

అసిడిటి మందులు ఎక్కువగా వాడితే ఎవరికి ఎక్కువ ప్రమాదం..

అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం ఉన్నప్పటికీ .. కొందరికి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు.

చాలా కాలంగా మందులు వాడుతున్న వ్యక్తులు.

వృద్ధులు.

మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు.

ఇతర మందులు తీసుకునే వ్యక్తులకు అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అసిడిటీకి సహజమైన నివారణలు..

ఎక్కువ నూనె పదార్థాలు, మసాలా పదార్థాలు, కారం ఎక్కువ ఉన్న పదార్థాలు తినడం తగ్గించాలి.

రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందుగా భోజనం  ముగించడం వల్ల అసిడిటీ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

బరువును అదుపులో ఉంచుకోవాలి.

ధూమపానం, మద్యపానం కు దూరంగా ఉండాలి. అలాంటి అలవాట్లు ఉంటే మానేయాలి.

ఆహారం తీసుకున్న ప్రతి సారి జస్ట్ ఒక 5నిమిషాల సేపు వాకింగ్ చేయడం మంచిది.

యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు రోజులో కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలి.

ప్రోబయోటిక్ ఆహారాలు బాగా తీసుకోవాలి.

రోజువారీ తీసుకునే ఆహారంలో ఫైబర్ బాగుండేలా జాగ్రత్త పడాలి.

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదు.  అలాగే ఏదైనా సమస్య  ఎక్కువ ఉంది కదా అనే ఉద్దేశ్యంతో డాక్టర్ చెప్పిన మోతాదు కంటే ఎక్కువ డోస్ లో మందులు వాడకూడదు.

అసిడిటీ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

                                    *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...