ఫార్ములా ఈ రేస్ కేసు.. ఎఫ్ఈవో సీఈవోను విచారించిన ఏసీబీ
posted on Feb 18, 2025 8:46AM
.webp)
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కీలక నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ, ఏసీబీలు విచారించాయి. అవసరమైతే మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పాయి. అలాగే ఇదే కేసులో సీసియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ, ఏసీబీలు విచారించాయి. ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఈ కేసులో ఎటువంటి పురోగతీ కనిపించలేదు.
అయితే ఇప్పడు మళ్లీ ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసులో సొమ్ములు అందుకున్నట్లు చెబుతున్న ఒక విదేశీ సంస్థకు ఏసీబీ నోటీసులు పంపింది. ఎఫ్ ఈఓకు పంపిన నోటీసులలో వర్చువల్ గా విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసుల మేరకు ఎఫ్ఈవో సంస్థ సీఈవో సోమవారం (ఫిబ్రవరి 17)న వర్చువల్ గా ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీబీ ఎఫ్ఈవో సీఈవో ఆల్బర్టోను సుదీర్ఘంగా విచారించింది. పలు కీలక అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించారు. ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అల్బర్టోను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలిసింది.