ఐఆర్ఆర్ కేసులో చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు.. పాతాళానికి దిగజారిన సర్కార్ పరువు!

జగన్ హయాంలో ఏపీ సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా మారిపోయిందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది.   విపక్ష నేతలను వేధించడం కోసం ఇష్టారీతిగా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయడం తప్ప ఆ దర్యాప్తు సంస్థకు మరో పని లేదని జనం భావిస్తున్న పరిస్థితి. ఇష్టారీతిగా అక్రమ కేసులు బనాయించి ఆ తరువాత కోర్టులో మొట్టికాయలు తినడం ఏపీ సీఐడీకి పరిపాటిగా మారిపోయింది.  రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు పరిగణనలోనికి తీసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికే .అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన చార్జిషీటును ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐఆర్ఆర్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కూడా ఏసీబీ తిరస్కరించింది. ఇలా వరుసగా ఏపీ సీఐడీ అక్రమ కేసులు బనాయించడం, కోర్టులు మొట్టికాయలు వేయడంతో దర్యాప్తు సంస్థ పరువే కాదు, జగన్ సర్కార్ ప్రతిష్ట కూడా పాతాళానికి దిగజారిపోతోందని పరిశీలకులు అంటున్నారు.

ఐఆర్ఆర్ కేసు విషయానికి వస్తే ..  ఇప్పుడు ఐఆర్ఆర్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకున్న తరువాతే ముందుకు సాగాల్సిన పరిస్థితి. అయితే అలా చేస్తే ఏపీ సీఐడీ ఈ కేసులో ఇప్పటి వరకూ ఎటువంటి అనుమతులూ లేకుండానే ఇష్టారీతిగా వ్యవహరించినట్లు అంగీకరించినట్లౌతుంది. దీంతొ ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో తెలియక ఏపీ సీఐడీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది.  వాస్తవానికి ఒక్క ఎకరం కూడా సేకరించని.. రూపాయి కూడా ఖర్చు పెట్టని ఐఆర్ఆర్ లో అవినీతి ఏమిటన్న తెలుగుదేశం వాదనే కరెక్టని, ఈ కేసులో చార్జిషీట్ ను నిరాకరించడం ద్వారా ఏసీబీ కోర్టు తేల్చేసినట్లైంది.  

ఈ కేసులో ఏ1గా  చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ  పేర్లను జోడించింది. లోకేష్ , లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా పేర్కొంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇంతకీ కేసేంటంటే.. సింగపూర్ తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని,  సింగపూర్ తో ఒప్పందానికి కేంద్రం నుంచి అనుమతి లేదనీ,  చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కు టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని సీఐడీ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది.  నిందితులకు ప్రయోజనం చేకూర్చేలా  ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లను రూపొందించారని..  లింగమనేని, మాజీ మంత్రి నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ను మార్చారనీ పేర్కొంది.  ఇన్నర్‌ రింగ్‌రోడ్డును లింగమనేని, హెరిటేజ్‌, నారాయణల ప్రయోజనం చేకూరేలా మాస్టర్ ప్లాన్ ను మార్చారనీ సీఐడీ తన చార్జ్ షీట్లో పేర్కొంది.  భూములకు అనుగుణంగా మార్చినట్టు సిఐడి ఛార్జిషీట్‌లో వెల్లడించింది.  

అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందుకు వెళ్లే విషయంలో ఏపీ సర్కార్ కు, ఏపీ సీఐడీకి మొదటి నుంచీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలు రద్దు చేయాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ముందస్తు బెయిలు రద్దుకు సుప్రీం నిర్ద్వంద్వంగా నిరాకరించడమే కాకుండా, ఈ కేసు విషయంలో ఈ దశలో కలుగజేసుకోబోమని స్పష్టం చేసింది.  హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఎంత మాత్రం ఉండదని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈ కేసులో అసలు చార్జ్ షిట్ నే పరిగణనలోనికి తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో సీఐడీ పరువుతో పాటు జగన్ సర్కార్ ప్రతిష్ట కూడా మంటగలిసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu