అవినీతి అంతానికి యాప్.. మరి, జగనన్న అవినీతి సంగతేంటి?
posted on Apr 20, 2022 6:33PM
ఏపీలో అవినీతి లేకుండా చేస్తానన్నారు సీఎం జగన్. కరెప్షన్ జరుగుతున్న విభాగాలను ప్రక్షాళన చేయాలన్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి ప్రత్యేక యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో యాప్ అందుబాటులోకి రావాలని.. హోంశాఖపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనపై జగనన్న కృషిని అంతా కొనియాడుతున్నారు. అంతా బాగుంది కానీ.. మరి, మీ అవినీతి సంగతేంటంటూ.. వైసీపీ నేతల కరెప్షన్ గురించి కూడా సమీక్షించండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
అవినీతి గురించి జగన్ మాట్లాడటం కామెడీగా ఉందంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే అవినీతితో వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి.. కరెప్షన్ మీద రివ్యూ చేయడం ఆసక్తిగా ఉందంటున్నారు. ఆ కేసుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్.. ఏపీలో కరెప్షన్ లేకుండా చేస్తానని చెబుతుండటం ఇంట్రెస్టింగ్ పాయింట్. కేవలం ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల్లో మాత్రమే అవినీతి లేకుండా చేస్తారా? లేదంటే, వైసీపీ వర్గాల అవినీతిపై కూడా చర్యలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
జే బ్రాండ్లు, జే టాక్సులతో జగన్‌రెడ్డితో పాటు వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ పదే పదే ఆరోపిస్తోంది. అదంతా అవినీతి సొమ్మేనని ఉద్యమాలు చేస్తోంది. ఇసుక నుంచి గనుల వరకూ.. ఏదీ వదలకుండా వైసీపీ ఘనులు కోట్లకు కోట్లు అవినీతికి పాల్పడుతున్నారని చెబుతోంది. అందుకే, ఏసీబీ రివ్యూలో తమరు, తమ నేతల కరెప్షన్ గురించి చర్చ జరిగిందా లేదా అని అడుగుతున్నారు ప్రతిపక్ష నాయకులు, ప్రజలు. ఒకవేళ ఏసీబీ కనుక అవినీతిపై యాప్ తీసుకొస్తే.. ఆ యాప్‌కు ఫిర్యాదుల వెల్లువతో.. మొదటి గంటలోనే హ్యాంగ్ అవడం ఖాయమంటున్నారు. ఆ కంప్లైంట్స్.. ఉద్యోగులపై కంటే వైసీపీ నేతల మీదే భారీగా వస్తాయని అంటున్నారు. దమ్ముంటే ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగుల కరెప్షన్‌తో పాటే.. పాలకుల, అధికార పార్టీ నేతల అవినీతిపైనా యాక్షన్ తీసుకొని.. ఏపీని అవినీతి పీడ నుంచి విముక్తి కలిగించాలని సూచిస్తున్నారు.