కాశ్మీర్ మృతులు 277.. ఒమర్ అబ్దుల్లా
posted on Sep 19, 2014 6:25PM

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో మొత్తం 277 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారికంగా ప్రకటించారు. గత 50 యేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయని అన్నారు. అయితే, తొలుత భయపడిన స్థాయిలో మరణాల సంఖ్య లేకపోవడం ఊరటని ఇస్తోందన్నారు. వరదల సమయంలో రాజౌరీ జిల్లాలో ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వారితో సహా ఒక్క జమ్మూలోనే 203 మంది మరణించారని వివరించారు. సహాయక చర్యల్లో భాగంగా 74 మృతదేహాలను కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో బయటకు తీసినట్లు ఒమర్ వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను జంతువులు తింటున్నాయని, మరికొన్ని దేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు కొట్టుకుపోయాయన్న వార్తలను ఆయన తిరస్కరించారు. కాగా, వరద బాధితులను రక్షించేందుకు సైన్యం అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు.