68 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వాతంత్ర్యం



భారతదేశం.. మనం ఈ దేశంలో ఇప్పుడు ఇంత స్వేచ్చగా.. ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే దీనికి ఎంతోమంది బలిదానాలు ప్రతిఫలమే. ఎందరో మహనీయుల త్యాగఫలమే. వారు సలిపిన నిర్విరామ పోరాటమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్యాలు. ఇప్పుడు స్వతంత్యం వచ్చి మనకు 68 సంవత్సరాలు అవుతున్నా... ఇప్పుడు మళ్లీ 68 సంవత్సరాల తరువాత కొంతమంది భారతీయులకు స్వతంత్ర్యం వచ్చింది. అదేలా అంటారా.. తలాతోక లేకుండా సాగిన దేశ విభజన ఫలితంగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులు అడ్డదిడ్డంగా రూపొందాయి. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఈ సరిహద్దు గురించి ఇరు దేశాల మధ్య ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ గొడవలకు సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు సాగిన ప్రయత్నాల వల్ల ఫలశ్రుతిగా 2011 సెప్టెంబరులో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య 'ప్రొటోకాల్‌' కుదిరింది. దీంతో వివాదాస్పద భూభాగాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, వారెవరూ ఉన్నచోటును వదిలిపెట్టి నిర్వాసితులై వెళ్లిపోవాల్సిన అవసరం లేకుండా  ఒప్పందం కుదరగా ఆ మేరకు 2013నాటి బిల్లు రూపొందింది. బంగ్లాదేశ్ లోని నాలుగు జిల్లాల పరిధిలో 111 గ్రామాల్లో కలిపి మొత్తం సుమారు 15000 మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఎవరి భూభాగంలోని పరగణాలు వారికే చెందేలా తీర్మానించిన బిల్లు- పరాధీనంలో ఉన్న ప్రాంతాల పంపకాల్నీ నిర్దేశించింది.
 


ఈ మేరకు భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు మధ్య ఒప్పందం కుదిరి.. సరిహ‌ద్దు ఒప్పందం పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు కూడా చేశారు. దీంతో 41 ఏళ్ల పాటు కొనసాగిన సరిహద్దు వివాదానికి ముగింపు పలికారు. తాజా సరిహ‌ద్దు ఒప్పందంతో భారత్ భూభాగంలోకి 51 గ్రామాలు, బంగ్లాదేశ్ లోకి 111 గ్రామాలు వెళ్లనున్నాయి.


దీంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 14 వేలమంది బంగ్లాదేశీయులకు నిన్న అర్ధరాత్రి భారత పౌరసత్వం లభించింది. దీంతో గ్రామాల్లో  సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భారత జెండా రెపరెపలాడుతున్నాయి. ఈ విభజనతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. ఈ నేపథ్యంలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వెల్లడించారు. ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది.