104 సేవలకు కిరణ్ సర్కార్ మంగళం
posted on Mar 13, 2012 5:40PM
నిరుపేద గ్రామీణ ప్రజలకు అత్యవసర సేవలతో పాటు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన 104 వైద్యసేవా విభాగాన్ని క్రమంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం వరకు వీరికి సక్రమంగా జీతాలు అందలేదు. మందులు కూడా సరఫరా చేయలేదు. డీజిల్ కూడా లేకపోవడంతో వాహనాలు మూలపడ్డాయి. దీనికి నిరసనగా 104 వైద్య సేవా విభాగం సిబ్బంది 121 రోజులు సమ్మె కూడా జరిపారు. అనంతరం ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో వీరు విధుల్లోకి చేరడానికి సిద్దమయ్యారు. కానీ వీరికి చేర్చుకోవడానికి జిల్లా అధికారులు నిరాకరిస్తున్నారు. సిబ్బందిలో కొంతమందిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తొలగించిన సిబ్బంది జాబితా అందిన తరువాతే మిగిలిన వారిని వీధులలోకి అనుమతిస్తామని జిల్లా అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా సుమారు 1500 మంది రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సిబ్బంది మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా 104 సేవా విభాగం కార్యకలాపాలు మరికొంత కాలంపాటు ప్రజలకు దక్కే సూచనలు కనిపించడంలేదు.