విశాఖ వుడా పై సిబీఐ కొరడా
posted on Jun 21, 2012 12:02PM
విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) అక్రమాలపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని సిబీఐ విశాఖ రేంజి డిఐజిని హైకోర్టు ఆదేశించింది. వుడా తమకు పంపించిన నోటీసులపై సవాల్ చేస్తూ బి.రామవరప్రసాద్, ఎ.సురేష్, మరో 11మంది హైకోర్టులో పిటీషను వేశారు. వుడా స్థల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన హైకోర్టు న్యాయమూర్తి దానిపై నివేదిక అవసరమని భావించి సిబీఐకి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే వివాదంలో విచారణకు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని గుర్తించిన న్యాయమూర్తి కేసును సుమోటోగా స్వీకరించారు. ప్రాథమిక విచారణ సిబీఐ విశాఖ రేంజి డిఐజి ఆరువారాల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలన్నారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను వుడా కొందరు బిల్డర్లకు అక్రమంగా కేటాయించింది. ఆ స్థలాల్లో భవన నిర్మాణాలకూ అక్రమంగా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో సిబీఐ నివేదిక హైకోర్టు కోరటం విశాఖలో పెద్ద సంచలనమైంది. ఆక్రమితదారులు ఆందోళన చెందుతున్నారు. సిబీఐ డిఐజి కార్యాలయంలో తమ సమీపబంధువులు ఎవరైనా పనిచేస్తుంటే వారి ద్వారా ప్రాథమిక విచారణ ఎప్పుడు ప్రారంభమావుతుందో తెలుసుకునేందుకు బిల్డర్లు సిద్ధపడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసు వల్ల సిబీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసుకున్న బిల్డర్లు భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో వుడాపై కేసువేస్తే అది వెనక్కు తగ్గుతుందనుకుంటే సిబీఐ విచారణకు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించటం పిటీషన్ వేసిన 13 మందికి మింగుడుపడటం లేదు. వుడాను కోర్టు హెచ్చరిస్తుందనుకుంటే న్యాయమూర్తి తమను హెచ్చరించినట్లు అయిందని ఓ బిల్డరు బహిరంగంగా వాపోయారు.