అప్పుడు నిద్రపోయాడు.. ఇప్పుడు లేచాడు..
posted on Aug 29, 2016 11:09AM

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రత్యేక హోదాపై అటు కేంద్రప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఏపీ నాయకులపై కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి..ప్రత్యేక హోదాకోసం పోరాడాలని అన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు అవుతుంది.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు.. రెండేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయాడని..ఇప్పుడు లేచి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమని.. ఎంపీలపై పవన్ చేసింది చౌకబారు విమర్శలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. రాజకీయం చేయడమంటే నెలనెలా జీతం తీసుకున్నట్లు కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని ఆయన అన్నారు.
అంతేకాదు ఎంపీలకు హిందీ రాదు అన్న వ్యాఖ్యలపై కూడా టీజీ స్పందించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని చెప్పడం పవన్ కల్యాణ్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఎంపీలు ఏ భాషలో మాట్లాడినా వెంటనే హిందీలోకి అనువాదం అవుతుందన్న విషయం ఆయనకు తెలియక పోవడం విచారకరమన్నారు. మొత్తానికి ఈమధ్యనే ఎంపీగా అధికార బాధ్యతలు చేపట్టిన టీజీని పవన్ వ్యాఖ్యలు బాగానే బాధించినట్టు ఉన్నాయి.