ఇక మీదట సమాజ్‌వాదీ సెంటు
posted on Mar 16, 2016 1:02PM

సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లలో అఖిలేష్ యాదవ్ సాధించిన ఘనత పెద్దగా ఏమీ లేదనీ, పైపెచ్చు నేరాలు పెచ్చరిల్లాయనీ విమర్శకులు అంటే అనవచ్చుగాక. తన ప్రభుత్వ కీర్తి గుబాళింపు ఎలా ఉన్నాగానీ, అఖలేష్‌కు మాత్రం తాము అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తియిన సందర్భంగా ఏదన్నా కొత్త పని చేయాలనిపించింది. ముఖ్యమంత్రి తల్చుకుంటే పథకాలకు కొదవా! వెంటనే ‘సమాజ్‌వాదీ సుగంధ్’ పేరుతో ఒక పరిమళాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఫ్రాగోమేట్రిక్స్ అనే సంస్థ అలాగే అంటూ ఓ నాలుగు పరిమళాలతో సమాజ్‌వాదీ సెంటుని రూపొందించింది. బెనారస్, కనౌజ్, తాజ్‌మహల్, రూమీదర్వాజా అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాలుగు ముఖ్య ప్రదేశాల పేరుతో నాలుగు పరిమళాలను రూపొందించారు. వీటిలో ఏ పరిమళాన్ని అద్దుకున్నా, ఆ ప్రదేశానికి వెళ్లిన అనుభూతి కలుగుతుందట. ఇంతకీ ఈ సెంటు సీసాలు ఎక్కడపడితే అక్కడ అమ్మరని తెలిసింది. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరా, రాజకీయనేతల కార్యాలయాల దగ్గర మాత్రమే అమ్ముతారట.