ఉద్యోగం కోసం వెళ్తే... ఓ ఇటుక ప్రాణం తీసింది
posted on Mar 16, 2016 5:04PM

23 ఏళ్లా మౌనికారెడ్డి ఓ B.Sc గ్రాడ్యుయేట్. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం కోసమని ఆమె నిన్న బెంగళూరుకి వెళ్లింది. అక్కడ జరిగిన తొలి రౌండ్ ముఖాముఖిలో తన ప్రతిభను బాగానే నిరూపించుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామనుకుంది. కానీ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో, ముఖాముఖి జరిగిన భవంతి నుంచి బయటకి వచ్చి నిల్చొంది. ఒక పక్క ఆమె తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతుండగానే, భవంతి పై నుంచి పడిన కొన్ని ఇటుకలు నేరుగా ఆమె తల మీద పడ్డాయి. దాంతో మౌనిక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మౌనికతో పాటుగా తోడు వచ్చిన ఆమె బంధువు, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. బెంగళూరులోని నిబంధనల ప్రకారం, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులకు తప్పనిసరిగా జాలీలు ఏర్పాటు చేయాలనీ, అలాంటి సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ జరిగినదానికి సంతాపం తెలియచేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామనీ, జరిగిన ఘటన గురించి నిర్వహించే దర్యాప్తుకు సహకరిస్తామనీ’ ఇన్ఫోసిస్ పేర్కొంది.